ప్రస్తుత విభాగం : model
పాఠం సామూహిక నమాజు
పురుషులు తమ అయిదు పూట్ల నమాజును సామూహికంగా చదవడాన్ని అల్లాహ్ విధి చేశాడు, దీని ప్రత్యేకత గురించి దైవప్రవక్త (స) వారు ఇలా ఉపదేశించారు ; ఒంటరిగా చదివే నమాజుకన్నా జమాతుతో కలిసి చదివే నాజులో 27 రెట్ల పుణ్యం ఎక్కువగా దొరుకుతుంది. (బుఖారీ 645, ముస్లిం 650).
అతి చిన్న జమాతు అనేది రెండు వ్యక్తులతో కలగలసి ఉంటుంది, ఇమాము మరియు అతని వెనుక చదివేవాడు, జమాతులో ఎంత ఎక్కువ మంది ఉంటే అది అల్లాహ్ కు అంత సంతుష్ఠమైన విషయం.
ఇమామ్ ను అనుసరించడం అనగా
ఇమాము వెనక నమాజు చదివేటపుడు పూర్తిగా ఇమాముకు కట్టుబడి ఉండాలి, రుకూ, సజ్దా మరియు అన్నింటిలో ఇమామును అనుసరించడంతోపాటుగా అతని ఖురాను పాఠనాన్ని జాగ్రత్తగా ఆలకించాలి, ఏదీ కూడా అతనికన్నా ముందు చేయకూడదు, అతనిని వ్యతిరేకించకూడదు, ఇమాము యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా పాఠించాలి.
ఇమామ్ యొక్క అనుసరణ
"వాస్తవానికి, జనులు అనుసరించడానికి ఇమామ్ నియమించబడ్డాడు. కాబట్టి, ఆయన తక్బీర్ (అల్లాహు అక్బర్ - అల్లాహ్ అత్యంత గొప్పవాడు) చెప్పినప్పుడు మీరు కూడా తక్బీర్ చెప్పండి. ఆయన తక్బీర్ చెప్పే వరకు మీరు తక్బీర్ చెప్పకండి. ఆయన రుకూ చేసినప్పుడు మీరు కూడా రుకూ చేయండి. ఆయన రుకూ చేసే వరకు మీరు రుకూ చేయకండి. ఆయన 'సమియల్లాహు లిమన్ హమిదాహ్' (అల్లాహ్ తనను స్తుతించే వారిని ఆలకిస్తాడు) అని చెప్పినప్పుడు మీరు 'అల్లాహుమ్మ రబ్బనా లకల్ హుమ్ద్' (ఓ అల్లాహ్, మా ప్రభూ, నీకు మాత్రమే సర్వ స్తుతులు చెందుతాయి) అని పలకండి. ఆయన సజ్దా చేసినప్పుడు మీరు కూడా సజ్దా చేయండి. ఆయన సజ్దా చేసే వరకు మీరు సజ్దా చేయకండి." (బుఖారీ 734, ముస్లిం 411, అబూ దావూద్ 603).
సామూహిక నమాజుకు నాయకత్వం వహించడానికి, ఎవరైతే ఖురానును ఎక్కువగా కంఠస్తం చేసి ఉండి బాగా చదవగలరో వారికి ప్రాధాన్యతనివ్వాలి, ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : అందరిలో ఎవరైతే ఎక్కువగా దైవగ్రంధాన్ని కంఠస్తం చేసిఉన్నారో వారు నమాజుకు నాయకత్వం వహిస్తారు, ఎవరైనా ఈ విషయంలో సమానంగా ఉంటే వారిలో వయసులో పెద్ద ఉన్నవారిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. (ముస్లిం 673).
నమాజులో ఇమాము అందరికన్నా ముందు నుంచోవాలి, అతని వెనుక నమాజు చదివేవారు అతని వెనుక పంక్తులలో వరుసగా నిలబడాలి, మొదటి పంక్తి పూర్తి అయిన తరువాతనే రెండవ పంక్తిలో నుంచోవాలి, ఎవరు ముందు వస్తే వారే ముందు నుంచునే హక్కుదారు అయి ఉంటారు, ఒక వేళ ఇమాము వెనకాల నమాజు చేసే వారు ఒక్కరే ఉంటే అతను ఇమాము పక్కన కుడివైపున నిలబడతాడు.
మస్జిదులో జమాతుతో కొంత నమాజు అయిపోయిన తరువాత ఆలస్యంగా చేరితే ఇమాము నమాజును ముగించేవారకూ ఆయననే అనుసరించాలి, ఇమాము నమాజు ముగించిన తరువాత మిగిలిపోయిన రెకాతులను పూర్తి చేసుకోవాలి, ఆ సమయంలో గమనించవలసిన విషయం ఏమంటే అతడు నమాజులో ప్రవేశించేటపుడు అతనికి అందిన రెకాతును అతని మొదటి రెకాతుగా లెక్కించుకోవాలి, ఈ విధంగా వదిలేసిన రెకాతులను పూర్తి చేసుకోవాలి.
సామూహికంగా నమాజు చదివేటపుడు ఇమాముతో పాటు రుకూ దొరికితే ఆ రెకాతు పూర్తిగా దొరికినట్లే, రుకూ అందకపోతే ఆ రెకాతు అలాగే దానికి ముందు అయిన రెకాతులు అందకుండా పోయినట్లే, ఇమాము తన నమాజును ముగించిన తరువాత మిగిలిన రెకాతులను పూర్తి చేసుకోవాలి.
ఇమాముతో మొదటి నమాజును కోల్పోయిన వారి ఉదాహరణలు
ఫజర్ నమాజులో ఇమాము రెండవ రెకాతులో ఉన్నప్పుడు కలిసినపుడు ఇమాము నమాజును ముగించిన తరువాత మిగిలిఉన్న ఒక రెకాతును పూర్తిచేసుకోవాలి, ఫజర్ లో రెండు రెకాతులు మాత్రమే ఉంటాయన్న విషయం విదితమే.
మగ్రిబ్ నమాజులో ఇమాము చివరి తషహ్హుద్ లో ఉన్న స్థితిలో నమాజులో కలిసినపుడు సమాజు ముగిసిన తరువాత అతడు పూర్తి మూడు రెకాతులను పూర్తి చేసుకోవలసి ఉంటుంది, ఎందుకంటే అతడు చివరి తషహ్హుద్ స్థితిలో ఉన్నప్పుడు వచ్చి కలిసాడు కాబట్టి అతనికి ఒక్క రెకాతు కూడా దొరకలేదు, ఒకవేళ రుకూ దొరికి ఉంటే ఒక రెకాతు దొరికేది.
ఒక వ్యక్తి దుహర్ నమాజులోని మూడవ రెకాతులో ఇమాంతో కలిసి నమాజు ప్రారంభించినట్లయితే, అతను ఇమాంతో కలిసి రెండు రెకాతులను పూర్తి చేస్తాడు (అతనికి మాత్రం అవి మొదటి మరియు రెండవ రెకాతులు). ఇమాం సలాం (నమాజు ముగింపు) చెప్పినప్పుడు, అతను లేచి మిగిలిన రెండు రెకాతులను(మూడవ మరియు నాల్గవ) పూర్తి చేయాలి. ఎందుకంటే దుహర్ నమాజు నాలుగు రెకాతులతో కూడినది అయి ఉంటుంది.