ప్రస్తుత విభాగం : model
పాఠం మృతదేహానికి జనాజా నమాజు చేయించడం మరియు పూడ్చడం
అంత్యక్రియల(జనాజా) నమాజు ప్రతి వ్యక్తిపై విడిగా కాకుండా హాజరైన ముస్లింలందరిపై తప్పనిసరి. ఇది ఒక సామూహిక బాధ్యత, కాబట్టి కొంతమంది దానిని నెరవేర్చినట్లయితే, మిగిలిన (ఈ నమాజుకు హాజరు కాని) వారి నుండి పాపం తొలగించబడుతుంది. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అంత్యక్రియల నమాజులో పాల్గొనే వారికి అపారమైన ప్రతిఫలం లభిస్తుందని వాగ్దానం చేశారు, "ఎవరైతే అంత్యక్రియలకు హాజరై, నమాజు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి ఒక ఖీరాత్ అంత ప్రతిఫలం లభిస్తుంది, మరియు ఎవరైతే ఖననం పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు ఖీరాత్’లు లభిస్తాయి." దానికి వారి(స)తో, "రెండు ఖీరాత్’లు అంటే ఏమిటి?" అని అడగబడినది. వారు(స) ఇలా సమాధానమిచ్చారు, "రెండు భారీ పర్వతాలంత (ప్రతిఫలం)" (బుఖారీ 1325, ముస్లిం 945).
జనాజా నమాజుకు హాజరు కావడం యొక్క ఔన్నత్యం
అంత్యక్రియలకు హాజరు కావడం మరియు జనాజాను అనుసరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి: చనిపోయిన వ్యక్తి కోసం వేడుకోవడం ద్వారా వారి హక్కును నెరవేర్చడం అనేది జరుగుతుంది, వారి తరపున మధ్యవర్తిత్వం(షఫాఅత్) వహించడం మరియు వారి కోసం వేడుకోవడం, వారి కుటుంబ సభ్యుల హక్కును నెరవేర్చడం, వారి ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారి బాధను తగ్గించడం, అంత్యక్రియలకు హాజరైన వారికి గొప్ప ప్రతిఫలం పొందడం, అంత్యక్రియలు మరియు సమాధులను చూడటం ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం మొదలైనవి.
1. జమాత్ (సామూహికంగా) జనాజా నమాజ్ చేయడం ఉత్తమం, మరియు సామూహిక నమాజు మాదిరిగానే ఇమాము ముందు ఉండాలి.
2. మృతదేహాన్ని జనాజా నమాజు చేసేవారికి మరియు ఖిబ్లాకు మధ్య ఉంచాలి. పురుషుడు అయితే అతని తల వద్ద, స్త్రీ అయితే ఆమె మధ్యన ఇమామ్ నిలబడాలి, దైవప్రవక్త (స) వారి నుండి ఇలానే వర్ణించబడినది (అబూ దావూద్ 3194).
-
మొదటి తక్బీరు
జనాజా నమాజు చేసే వ్యక్తి మొదటి తక్బీర్ చెప్పేటప్పుడు తన చేతులను భుజాల ఎత్తు వరకు లేదా చెవుల దొప్పల ఎత్తు వరకు ఎత్తాలి, తరువాత తన కుడి చేతిని ఎడమ చేతిపై తన ఛాతీపై ఉంచాలి. ఇస్తిఫ్తాహ్ (సాధారణ నమాజ్ లో మొదట 'సుబ్హానక...' చదవడం) చేయకూడదు, ఆ తరువాత అవుజు బిల్లాహ్, బిస్మిల్లాహ్ చదివి, సూరా ఫాతిహా నిశ్శబ్దంగా చదవాలి.
రెండవ తక్బీర్
ఆ తరువాత రెండవ తక్బీర్ చెప్పి, దైవప్రవక్త (స) వారిపై ఏదైనా రూపంలో సలాం చెప్పాలి, ఉదాహరణకు: "అల్లాహుమ్మ సల్లి వ సల్లిం అలా నబీయ్యినా ముహమ్మద్". చివరి తషహ్హుద్ లో చదివే పూర్తి దరూద్ చదివితే మరింత మంచిది, దాని విధానం: “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్” (ఓ అల్లాహ్! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై కరుణ చూపించు మరియు ఆయన పరివారం పై కూడా – ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారం పై కరుణ చూపించావో, నిశ్చయంగా నీవు ప్రశంనీయుడవూ, విధాతవూనూ. ఓ అల్లాహ్! ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై శుభాలు కురిపించు మరియు ఆయన పరివారం పై కూడా , ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారం పై శుభాలు కురిపించావో, నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవూ, విధాతవూనూ).
.మూడవ తక్బీర్
ఆ తరువాత మూడవ తక్బీర్ చెప్పి, ఆ తరువాత మృతుని కోసం కరుణ, క్షమాపణ, స్వర్గం, ఉన్నత స్థానం కోసం దుఆ చేయాలి, ప్రవక్త (స) వారి నుండి నిరూపితమైన దుఆలు గుర్తుంటే వాటిని చదవడం మరింత మంచిది.
ఆ దుఆలలో ఒకటి: అల్లాహుమ్మగ్ ఫిర్ లహు, వర్ హంహు వ ఆఫిహి, వ అఫ్ఉ అన్ హు, వ అకరిమ్ నుజులహు, వవస్సి ముద్ ఖలహు, వగ్ సిల్ హు, బిల్ మాయి వథ్థల్ జి, వల్ బరది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖితథ్థౌబుల్ అబ్ యదు మినద్దనసి, వ అబ్ దిల్ హు, దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్ లన్ ఖైరన్ మిన్ అహ్ లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహి, వ అద్ ఖిల్ హుల్ జన్నత వఖిహి ఫిత్నతల్ ఖబ్రి వ అజాబిన్నారి. ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతని మీద దయ చూపు, అతన్ని క్షమించి శిక్షనుండి కాపాడు, అతన్ని మన్నించు, అతనికి ఉత్తమ స్థానము ప్రసాదించు, అతనికి విశాలమైన నివాసము ప్రసాదించు, అతని పాపములను నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి, తెల్లని వస్త్రాన్ని మురికి నుండి శుభ్రపరచినట్లు అతన్ని పాపాలనుండి శుభ్రపరుచు. అతనికి ఇహలోకపు ఇల్లు కంటే మంచి ఇల్లుని, ఇహలోకపు సంతతి కంటే ఉత్తమ సంతతిని, ఇహలోకపు ఇల్లాలి కంటే మంచి ఇల్లాలిని ప్రసాదించు. అతనిని స్వర్గంలో ప్రవేశింపజేయి. సమాధి శిక్షనుండి నరకాగ్ని శిక్షనుండి అతన్ని రక్షించు.(ముస్లిం 963).
నాల్గవ తక్బీర్
ఆ తర్వాత నాల్గవసారి తక్బీర్ చెప్పి కొద్దిసేపు ఆగి, కుడి వైపుకు మాత్రమే సలాం చెప్పాలి.
జనాజా నమాజును మస్జిదులో, లేదా మస్జిదు వెలుపల ప్రత్యేకంగా దాని కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో, లేదా ఖబరస్తాన్ (స్మశానం) లో ఆచరించవచ్చు. ఈ అన్ని పద్ధతులు దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి చేత ఆచరించబడ్డాయి.
మృతదేహాన్ని సిద్ధం చేయడం, జనాజా నమాజు చేయడం, దానిని శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేయడంలో త్వరపడటం అనేది సున్నత్ (దైవప్రవక్త(స) వారు ఆచరించిన పద్ధతి). అబూ హురైరా (ర) వారి ఉల్లేఖనం : దైవప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు : “మృతదేహాన్ని త్వరగా ఖననం చేయండి, ఎందుకంటే అది మంచి వ్యక్తి అయితే, మీరు అతనికి మంచిని అందించినట్లవుతుంది. అది అలా కాకపోతే, మీరు మీ భుజాల నుండి దానిని దించుకున్నట్లు అవుతుంది." (బుఖారి 1315, ముస్లిం 944).
ఖననంలో పాల్గొనే వారు మృతదేహాన్ని మోయడంలో పాలుపంచుకోవడం ఉత్తమం. మృతదేహాన్ని పురుషులు మాత్రమే మోయాలి, స్త్రీలు కాదు. జనాజాను తీసుకువెళ్లేటపుడు పాదచారులు దానికి ముందు మరియు వెనుక ఉండటం అనేది సున్నతు. శ్మశానం దూరంగా ఉంటే లేదా ఇబ్బంది ఉంటే, మృతదేహాన్ని జంతువుపై లేదా వాహనంలో తీసుకెళ్లడంలో తప్పు లేదు.
మృతదేహం ఖననం విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఖననం తర్వాత, అక్కడ ఉన్నవారు మృత వ్యక్తి కోసం స్థిరత్వం మరియు క్షమాపణ కోసం దుఆ చేయడం మంచిది. దైవప్రవక్త (స) వారు ఖననం పూర్తయిన తర్వాత మృతదేహం దగ్గర నిలబడి, ఇలా చెప్పేవారు: "మీ సోదరుడి కోసం క్షమాపణ కోరండి, అతనికి స్థిరత్వం ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోండి, ఎందుకంటే అతను ప్రస్తుతం ప్రశ్నించబడుతున్నాడు" (అబూ దావూద్ 3221).