ప్రస్తుత విభాగం : model
పాఠం ఆరాధన (ఇబాదత్) యొక్క వాస్తవికత
ఆరాధన (ఇబాదత్): అల్లాహ్ కు ఇష్టమైన మరియు ఆయనను ప్రసన్నం చేసే ప్రతి మాట మరియు ప్రతి కార్యం అది అంతర్గతమైనదైనా లేదా బహిర్గతమైనదైనా, వీటన్నింటినీ కలిపి ఆరాధన అని అంటారు. కాబట్టి అల్లాహ్ కు ఇష్టమైన ప్రతి పని మరియు ప్రతి మాట ఆరాధనగా పరిగణించబడుతుంది.
ఆరాధన యొక్క వాస్తవికత
ఆరాధన (ఇబాదత్) అంటే: ప్రేమ, గౌరవం మరియు వినమ్రతతో కూడిన సంపూర్ణ విధేయత. ఇది తన దాసులపై అల్లాహ్ కు ఉన్న హక్కు. ఇది కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం, ఇతరులెవరికీ ఇందులో భాగం లేదు. అల్లాహ్ ఆదేశించిన మరియు ప్రోత్సహించిన, ఆయనకు ఇష్టమైన మరియు ఆయనను ప్రసన్నం చేసే ప్రతి మాట మరియు ప్రతి కార్యం ఇందులో భాగమే. అది నమాజు, జకాతు మరియు హజ్ వంటి బహిర్గత ఆచరణలు అయినా సరే, లేదా హృదయపూర్వకముగా అల్లాహ్ ను స్మరించడం, ఆయనకు భయపడటం, ఆయనపైనే భరోసా (తవక్కుల్) ఉంచడం మరియు ఆయన సహాయాన్ని అర్థించడం వంటి అంతర్గత పనులైనా సరే ఇవన్నీ ఆరాధన కిందకే వస్తాయి.
అల్లాహ్ తన దాసులపై చూపే కారుణ్యం ఏమిటంటే, ఆయన వారి కోసం ఆరాధనలను రకరకాలుగా (వైవిధ్యంగా) ఉంచాడు. వాటిలో కొన్ని:
మానవుడు తన మనసులో ఆరాధనల పట్ల ఉత్సాహాన్ని మరియు ఆసక్తిని కలిగి ఉండాలని, తద్వారా అతనికి విసుగు లేదా అలసట కలగకుండా ఉండాలని అల్లాహ్ తన జ్ఞానంతో ఆరాధనలను విభిన్నంగా మరియు అనేక రకాలుగా చేశాడు. అదేవిధంగా, మనిషి తన మనసు ఏ ఆరాధన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుందో, దానిని ఆసక్తితో చేసే అవకాశం కల్పించడం కూడా ఇందులో ఒక ఉద్దేశం.
ఆరాధనలు ఎలాగైతే విభిన్నంగా ఉంటాయో, అలాగే ప్రజల ఆసక్తులు మరియు సామర్థ్యాలు కూడా విభిన్నంగా ఉంటాయి. కొందరు ఒక నిర్దిష్ట ఆరాధనలో ఇతరులకన్నా ఎక్కువ ఉత్సాహాన్ని మరియు శ్రద్ధను కనబరుస్తారు. ఉదాహరణకు, ఒకరికి ప్రజల పట్ల ఉపకారం చేయడం అత్యంత ఇష్టమైనదిగా ఉండవచ్చు, మరొకరికి నఫిల్ ఉపవాసాలు ఎక్కువగా ఉండటం సులభతరం చేయబడవచ్చు, ఇంకొకరి హృదయం ఖుర్ఆన్ పఠనం మరియు దానిని కంఠస్థం చేయడంలో నిమగ్నమై ఉండవచ్చు.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: నమాజు(సలాత్) క్రమం తప్పకుండా పాటించే వారు స్వర్గంలోని 'బాబ్ అస్-సలాత్' (నమాజూ ద్వారం) నుండి పిలవబడతారు. జిహాద్ చేసే వారు 'బాబ్ అల్-జిహాద్' ద్వారా, దానధర్మాలు (సదకా) చేసే వారు 'బాబ్ అస్-సదకా' ద్వారా మరియు ఉపవాసాలు పాటించే వారు 'బాబ్ అర్-రయ్యాన్' ద్వారా పిలవబడతారు." అప్పుడు అబూ బకర్ సిద్దీక్ (ర) వారు, ఓ దైవప్రవక్త! ఈ ద్వారాలలో ఏదో ఒక దాని నుండి పిలవబడే వారికి ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఈ అన్ని ద్వారాల నుండి పిలవబడే వారు ఎవరైనా ఉంటారా? అని అడిగారు. అందుకు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు, అవును ఉంటారు, నీవు కూడా వారిలో ఒకడివి కావాలని నేను ఆశిస్తున్నాను. అని సెలవిచ్చారు. (బుఖారీ: 1897, ముస్లిం: 1027).
విశ్వాసి చేసే ప్రతి పని వెనుక అల్లాహ్ సామీప్యాన్ని పొందాలనే సంకల్పం ఉన్నట్లయితే, అది ఆరాధన కిందకే వస్తుంది. ఇస్లాం ధర్మంలో ఆరాధన అనేది కేవలం నమాజ్, ఉపవాసం వంటి తెలిసిన కొన్ని ఆరాధన కృత్యాలకు మాత్రమే పరిమితం కాలేదు. మంచి ఉద్దేశం మరియు సరైన సంకల్పంతో చేసే ప్రతి ప్రయోజనకరమైన పని ఆరాధనగా మారుతుంది, తద్వారా పుణ్యం లభిస్తుంది. ఉదాహరణకు, ఒక ముస్లిము అల్లాహ్ యొక్క విధేయత(ఆరాధన)లో శక్తిని పొందే ఉద్దేశంతో తిన్నా, తాగినా లేదా నిద్రించినా, ఆ పనులకు కూడా అతడు పుణ్యాన్ని పొందుతాడు.
ఒక ముస్లిము తన జీవితమంతా అల్లాహ్ కోసమే జీవిస్తాడు. అల్లాహ్ యొక్క విధేయతను (ఇబాదత్‌ను) పాటించేందుకు అవసరమైన శక్తిని పొందే ఉద్దేశంతో అతను భుజిస్తే, ఆ ఉద్దేశం కారణంగా అతని భోజనం కూడా ఒక ఆరాధన అవుతుంది. అలాగే తనను తాను హరామ్ (నిషిద్ధం) నుండి కాపాడుకుని, పవిత్రంగా ఉంచుకోవడానికి వివాహం చేసుకుంటే, అతని వివాహం కూడా ఆరాధనగా మారుతుంది. ఇదే విధమైన సంకల్పంతో చేసే వ్యాపారం, ఉద్యోగం మరియు సంపాదన కూడా ఆరాధనలే అవుతాయి. విద్యను అభ్యసించడం, పట్టాలు పొందడం, పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు అన్వేషణలు చేయడం కూడా ఆరాధన కిందకే వస్తాయి. ఒక స్త్రీ తన భర్తను, పిల్లలను మరియు ఇంటిని సంరక్షించడం కూడా ఆరాధన అవుతుంది. ఈ విధంగా జీవితంలోని అన్ని రంగాలు, ప్రయోజనకరమైన పనులు మరియు వ్యవహారాల వెనుక మంచి సంకల్పం మరియు సరైన ఉద్దేశం ఉన్నంత కాలం అవన్నీ ఆరాధనలుగానే పరిగణించబడతాయి.
సృష్టి వెనుక ఉన్న పరమార్థం ఆరాధనే.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "నేను జిన్నాతులను మరియు మనుష్యులను కేవలం నన్ను ఆరాధించడానికే సృష్టించాను. నేను వారి నుండి ఎటువంటి జీవనోపాధిని (రిజ్క్) ఆశించడం లేదు, మరియు వారు నాకు ఆహారం తినిపించాలని కూడా నేను కోరుకోవడం లేదు. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే అందరికీ జీవనోపాధిని ప్రసాదించేవాడు, మరియు ఆయన అమితమైన శక్తివంతుడు, అత్యంత బలవంతుడు." (జారియాత్: 56-58).
అల్లాహ్ తన సృష్టి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం జిన్నాతులు మరియు మనుష్యులు తనను ఆరాధించడమేనని తెలియజేశాడు. వాస్తవానికి అల్లాహ్ కు వారి ఆరాధనతో ఎటువంటి అవసరము లేదు, ఆయన స్వయంసమృద్ధుడు. అయితే మనుష్యులు తమ జీవిత సాఫల్యం కోసం మరియు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ పైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి, ఆరాధన అనేది మనుష్యులకే ఎంతో ఆవశ్యకం.
ఒకవేళ మనిషి తన ఉనికి వెనుక ఉన్న ఆ లక్ష్యాన్ని విస్మరించి, దైవం తనను సృష్టించిన ఉద్దేశాన్ని మరచి కేవలం ప్రాపంచిక సుఖాలలో మునిగిపోతే, అతను ఈ భూమిపై ఉన్న ఇతర ప్రాణులతో సమానమైపోతాడు. అప్పుడు అతనికి, ఇతర జీవులకు ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే పశువులు కూడా ఆహారం తింటాయి మరియు వినోదాల్లో మునిగిపోతాయి. అయితే మనిషితో పోలిస్తే వాటికి పరలోకంలో లెక్క ఒప్పించవలసిన అవసరం లేదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "సత్యతిరస్కారులు కేవలం ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తారు మరియు పశువుల మాదిరిగా తింటారు. అలాంటి వారి నివాసం నరకాగ్ని." (ముహమ్మద్: 12). వారు తమ పనులలో మరియు లక్ష్యాలలో పశువులతో సమానమైనప్పటికీ, మనిషికి ఆలోచించే మరియు గ్రహించే విచక్షణ జ్ఞానం ఉన్నందున, వారు చేసే పనులకు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. పశువులకు అటువంటి తెలివితేటలు లేవు కాబట్టి వాటికి ఆ నిబంధన వర్తించదు.
అల్లాహ్ ఆజ్ఞాపించిన ఆరాధన మూడు ముఖ్యమైన స్తంభాలపై (అర్కాన్‌లపై) ఆధారపడి ఉంది. వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి.
ఆరాధన యొక్క మూలస్థంబాలు
అల్లాహ్ తన దాసులపై విధిగా నిర్ణయించిన ఆరాధనలో, ఆయన పట్ల అత్యున్నత స్థాయి ప్రేమ, అభిలాషమరియు ఆశలతో పాటు, అల్లాహ్ పట్ల సంపూర్ణ అణకువ, విధేయత మరియు భయం కలిగి ఉండటం తప్పనిసరి.
దీని ప్రకారం, భయం మరియు అణకువ లేని ప్రేమ - ఉదాహరణకు ఆహారం మరియు ధనంపై ఉండే ప్రేమ వంటివి - ఆరాధన కిందకు రావు. అదేవిధంగా, ప్రేమ లేని భయం - ఉదాహరణకు క్రూర మృగం లేదా అక్రమంగా పరిపాలించే పాలకుడి పట్ల ఉండే భయం వంటివి - కూడా ఆరాధనగా పరిగణించబడవు. భయం, ప్రేమ మరియు ఆశ అనేవి ఒక కార్యంలో ఏకమైనప్పుడే అది ఆరాధన అవుతుంది. అటువంటి ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది.
ఒక ముస్లిము నమాజు చేసినా లేదా ఉపవాసం ఉన్నా, అతని ఆ ఉద్దేశం వెనుక అల్లాహ్ పట్ల ప్రేమ, ఆయన ఇచ్చే పుణ్యఫలంపై ఆశ మరియు ఆయన శిక్ష పట్ల భయం ఉన్నప్పుడే అది ఆరాధన అవుతుంది. అలా కాకుండా, 'నమాజు చదవటం లేదు' అని ఇతరులు అనుకోకూడదనే ఉద్దేశంతో నమాజు చేసినా లేదా కేవలం ఆరోగ్యం కోసం ఉపవాసం ఉన్నా, అది ఆరాధనగా పరిగణించబడదు.
అల్లాహ్ తన దైవప్రవక్తల గురించి ఈ విధంగా ప్రశంసిస్తూ సెలవిచ్చాడు: "నిశ్చయంగా వీరు పుణ్యకార్యాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండేవారు. మరియు వారు ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని ప్రార్థిస్తూ ఉండేవారు. వారు మా పట్ల పూర్తి అణకువను కలిగి ఉండేవారు." (అన్బియా: 90).
ఆరాధన యొక్క రకాలు
1- సంపూర్ణ ఆరాధనలు:
అల్లాహ్ మరియు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించినవే ఇవి. వీటిని ఆరాధనలుగా మాత్రమే పరిగణించాలి. ఉదాహరణకు: నమాజ్, ఉపవాసం, హజ్, దుఆ (వేడుకోలు), తవాఫ్ మరియు ఇటువంటి ఇతర క్రియలు. ఈ ఆరాధనలను అల్లాహ్ కు తప్ప ఇతరులకు అంకితం చేయకూడదు, అలాగే వీటి పుణ్యాన్ని (ఫలాన్ని) కూడా ఆయన నుండి తప్ప వేరెవరి నుండి ఆశించకూడదు.
2- సంకల్పం (నియ్యత్) ద్వారా ఆరాధనగా మారేవి:
అల్లాహ్ ఆదేశించిన లేదా ప్రజలను ప్రోత్సహించిన ఉత్తమ నైతిక విలువలు వీటిలోకి వస్తాయి. ఉదాహరణకు: తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగడం, ఇతరులకు మేలు చేయడం మరియు బాధితులకు తోడ్పడటం వంటివి. అల్లాహ్ సామాన్యంగా ఆదేశించిన ఇటువంటి ఇతర ఉన్నతమైన ఆచారాలను మరియు నైతిక విలువలను ముస్లిములు విడిచిపెడితే పాపానికి గురవుతారు. ఇటువంటి సామాజిక మరియు నైతిక సంబంధిత ఆరాధనల్లో, ఇతర ఆరాధనల (ఇబాదత్) వలె దైవప్రవక్త ముహమ్మద్ (స) వారిని ప్రతి చిన్న సూక్ష్మ వివరంలోనూ, ప్రతి అడుగులోనూ తు.చ తప్పకుండా అనుసరించాల్సిన కచ్చితమైన నిబంధన లేదు. కేవలం ధర్మ సూత్రాలకు విరుద్ధంగా నడుచుకోకుండా మరియు నిషిద్ధమైన పనులకు దూరంగా ఉంటే సరిపోతుంది.
ఈ పనులు చేసేటప్పుడు మనిషి తన సంకల్పం (నియ్యత్) మంచిగా ఉంచుకొని, వీటి ద్వారా అల్లాహ్ యొక్క విధేయతను పొందాలని ఆశించినప్పుడు అతనికి పుణ్యం (అజర్) లభిస్తుంది. ఒకవేళ వీటిని చేస్తున్నప్పుడు అల్లాహ్ ప్రసన్నతను ఆశించకపోతే, అతనికి ఎటువంటి పుణ్యం లభించదు, అలాగని అతను పాపాత్ముడు కూడా కాడు. ఇటువంటి ఆరాధనల్లో నిత్య జీవితానికి సంబంధించిన పనులైన నిద్ర, ఉద్యోగం, వ్యాపారం, వ్యాయామం వంటివి వస్తాయి. కాబట్టి, అల్లాహ్ సంతుష్టత కోసం చేసే ప్రతి ప్రయోజనకరమైన పనికీ పుణ్యం లభిస్తుంది. "నిశ్చయంగా, ఉత్తమ రీతిలో ఆచరణలు చేసే వారి పుణ్యాన్ని మేము వృధా చేయము" (అల్ కహఫ్: 30).
ఆరాధన యొక్క ప్రామాణికతకు మరియు అది స్వీకరించబడటానికి రెండు నిబంధనలు ఉన్నాయి:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "కాబట్టి తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి మరియు తన ప్రభువు ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయకూడదు" (అల్ కహఫ్: 110).
"తన ప్రభువు ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయకూడదు" అనే వాక్యం, ఆరాధనను ఇతరులకు కాకుండా అల్లాహ్ కు మాత్రమే అంకితం చేయాలని (ఇఖ్లాస్) తెలియజేస్తోంది. అలాగే "సత్కార్యాలు" అనే పదం సున్నత్ అనుసరణను సూచిస్తోంది; ఎందుకంటే సత్కార్యం అంటే సరైన కార్యమని అర్థం, అది దైవప్రవక్త ముహమ్మద్(స) వారి సున్నత్ కు అనుగుణంగా ఉన్నప్పుడే సరైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి, అల్లాహ్ ప్రసన్నతను మరియు పరలోక సాఫల్యాన్ని కోరుకునే వారు ఈ ఆయత్ లో పేర్కొన్న రెండు నిబంధనల ప్రకారం అల్లాహ్ ను ఆరాధించాలి.
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.