నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ముస్లిము మహిళ యొక్క శుద్ధత

ముస్లిము మహిళా శుద్ధతకు సంబంధించిన ధర్మశాస్త్ర నియమాలను మనం ఈ పాఠంలో తెలుసుకుందాము.

  • మహిళ తనకు సంబంధించిన శుద్ధత (తహారా) నియమాలను నేర్చుకోవడంలో గల ధర్మశాస్త్ర తీర్పును వివరించడం.
  • జనాబత్(లైంగిక అశుద్ధత),  బహిష్టు (హైద్),  ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) మరియు వాటికి సంబంధించిన కొన్ని నియమాలను పరిచయం చేయడం.
  • బహిష్టు మరియు ప్రసవానంతర రక్తస్రావం కాకుండా మహిళా శరీరం నుండి వెలువడే ఇతర స్రావాలకు సంబంధించిన నియమాలను వివరించడం.

ముస్లిము మహిళ తనకు సంబంధించిన శుద్ధత నియమాలైన బహిష్టు (హైద్), ఇస్తిహాద (అసాధారణ రక్తస్రావం) మరియు ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) వంటి అంశాలలో తనకు అవసరమైన జ్ఞానాన్ని నేర్చుకోవడాన్ని ఇస్లామీయ నియమావళి (షరీఅత్) తప్పనిసరి చేసింది.

ముస్లిము మహిళ తప్పనిసరిగా తెలుసుకొని ఆచరించవలసిన అంశాలలో ఇవి ముఖ్యమైనవి:

١
లైంగిక అశుద్ధత (జనాబత్) నుండి శుద్ధత పొందుటకు స్నానం (గుస్ల్) చేయడం.
٢
బహిష్టు (హైద్) ముగిసిన తర్వాత స్నానం చేయడం.
٣
ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) ముగిసిన తర్వాత స్నానం చేయడం.

లైంగిక అశుద్ధత కారణంగా శుద్ధత (గుసుల్) చేసుకోవడం.

భాషా పరంగా 'జనాబత్' అంటే దూరం అని అర్థం. ఇస్లామీయ నియమావళి (షరీఅత్) ప్రకారం వీర్యం వెలువడిన వారు లేదా సంభోగంలో పాల్గొన్న వారు 'జునుబ్' అవుతారు. ఈ పదం పురుషులకు మరియు మహిళలకు ఇరువురికీ వర్తిస్తుంది. శుద్ధత (తహారా) పొందే వరకు నమాజు చేసే ప్రదేశాలకు దగ్గరకు వెళ్ళడం నిషిద్ధం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. జనాబత్ నుండి స్నానం చేయడం అనివార్యం (వాజిబ్). దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఒకవేళ మీరు జనాబత్ స్థితిలో ఉంటే శుద్ధత పొందుము (స్నానం చేయుము)." (అల్-మాయిదా: 6).

ఋతుకాలం ముగిసిన తరువాత గుసుల్ చేయడం

ముస్లిం మహిళ తన బహిష్టు రక్తం ఆగిపోయిన తర్వాత స్నానం చేయడం అనివార్యం. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "వారు నీతో బహిష్టు గురించి అడుగుతున్నారు. అది ఒక అశుద్ధత అని చెప్పు. కాబట్టి బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు మహిళలకు దూరంగా ఉండండి. వారు శుద్ధత పొందే వరకు వారిని సమీపించకండి. వారు శుద్ధత పొందిన (స్నానం చేసిన) తర్వాత, అల్లాహ్ మీకు ఆదేశించిన విధంగా వారి వద్దకు వెళ్ళండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపం చెందేవారిని మరియు శుద్ధతను (తహారా) పాటించేవారిని ప్రేమిస్తాడు." (అల్-బఖరా: 222). ఇక్కడ 'వారు శుద్ధత పొందిన తర్వాత' అంటే గుస్ల్ చేసిన తర్వాత అని అర్థం.

బహిష్టు మరియు ఇస్తిహాద

బహిష్టు (హైద్): ప్రసవం లేదా అనారోగ్యం కారణం కాకుండా, మహిళ గర్భాశయం నుండి సహజంగా వెలువడే రక్తాన్ని బహిష్టు అంటారు. ఇస్తిహాద (అసాధారణ రక్తస్రావం): అనారోగ్యం లేదా ఇతర శారీరక లోపాల కారణంగా, సాధారణ బహిష్టు సమయాలు కాకుండా ఇతర సమయాల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తస్రావాన్ని ఇస్తిహాద అంటారు.

మహిళల మధ్య బహిష్టు (హైద్) కాల వ్యవధి మారుతూ ఉంటుంది. విద్వాంసుల అభిప్రాయాల ప్రకారం, దీని కనిష్ట కాల పరిమితికి ఎటువంటి నిర్దిష్ట పరిమితి లేదు. అయితే మెజారిటీ విద్వాంసుల అభిప్రాయం ప్రకారం దీని గరిష్ట కాల పరిమితి పదిహేను రోజులు. అంతకంటే ఎక్కువ రోజులు రక్తస్రావం జరిగితే దానిని ఇస్తిహాద (అసాధారణ రక్తస్రావం) గా పరిగణించాలి తప్ప బహిష్టు రక్తంగా కాదు. సాధారణంగా మహిళల్లో బహిష్టు కాలం ఆరు లేదా ఏడు రోజులు ఉంటుంది.

ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) ముగిసిన తర్వాత స్నానం (గుస్ల్)

ప్రసవానంతర రక్తస్రావం ముగిసిన తర్వాత నిఫాస్ స్థితిలో ఉన్న మహిళ స్నానం చేయడం అనివార్యమని విద్వాంసులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

నిఫాస్ అనగా

ప్రసవ సమయంలో లేదా ప్రసవానికి రెండు మూడు రోజుల ముందు (నొప్పులు వంటి లక్షణాలతో కూడి) మరియు ప్రసవం తర్వాత గరిష్టంగా నలభై రోజుల వరకు గర్భాశయం నుండి వెలువడే రక్తాన్ని నిఫాస్ అంటారు. నిఫాస్ యొక్క గరిష్ట కాల పరిమితి నలభై రోజులు, దీనికి కనిష్ట కాల పరిమితి లేదు. మహిళకు ఎప్పుడు శుద్ధత (తహారా) కనిపిస్తే అప్పుడు ఆమె స్నానం చేసి నమాజు ఆచరించాలి.

బహిష్టు (హైద్) మరియు ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) వల్ల కలిగే పరిణామాలు:

١
సంభోగం చేయడం నిషిద్ధం.
٢
విడాకులు (తలాక్) ఇవ్వడం నిషిద్ధం.
٣
నమాజు ఆచరించడం మరియు ఉపవాసం ఉండటం నిషిద్ధం.
٤
కాబా చుట్టూ తవాఫ్ చేయడం నిషిద్ధం.
٥
ఖుర్ఆన్ గ్రంథాన్ని (ముస్హఫ్) తాకడం నిషిద్ధం.
٦
మసీదులో ఉండడం లేదా వేచి ఉండటం నిషిద్ధం.

సంభోగం నిషిద్దం

పురుషుడు తన భార్య బహిష్టు (హైద్) స్థితిలో ఉన్నప్పుడు ఆమెతో సంభోగంలో పాల్గొనడం నిషిద్ధం. దీని గురించి అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: "వారు నీతో బహిష్టు గురించి అడుగుతున్నారు. అది ఒక అశుద్ధత అని చెప్పు. కాబట్టి బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు మహిళలకు దూరంగా ఉండండి. వారు శుద్ధత (తహారా) పొందే వరకు వారిని సమీపించకండి. వారు శుద్ధత పొందిన తర్వాత, అల్లాహ్ మీకు ఆదేశించిన విధంగా వారి వద్దకు వెళ్ళండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపం చెందేవారిని మరియు శుద్ధతను పాటించేవారిని ప్రేమిస్తాడు." (అల్-బఖరా: 222). అదేవిధంగా, ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) స్థితిలో ఉన్న మహిళతో కూడా సంభోగం చేయడం నిషిద్ధమని విద్వాంసులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

విడాకులు (తలాక్) నిషిద్ధం

బహిష్టు లేదా ప్రసవానంతర రక్తస్రావం స్థితిలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వడం నిషిద్ధం. దీని గురించి అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: "ఓ ప్రవక్తా! మీరు మహిళలకు విడాకులు ఇవ్వదలచుకుంటే, వారి ఇద్దత్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని విడాకులు ఇవ్వండి." (అత్-తలాక్: 1). "వారి ఇద్దత్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని విడాకులు ఇవ్వండి" అనే వాక్యానికి అర్థం ఏమిటంటే—మహిళ బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు కానీ, ప్రసవానంతర రక్తస్రావ స్థితిలో ఉన్నప్పుడు కానీ లేదా ఆమె శుద్ధతతో ఉండి సంభోగం జరిగిన తర్వాత గర్భం దాల్చినట్లు స్పష్టంగా తెలియనప్పుడు కానీ విడాకులు ఇవ్వకూడదని అర్థం.

నమాజు మరియు ఉపవాసం నిషిద్ధం

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మహిళ బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు ఆమె నమాజు ఆచరించదు మరియు ఉపవాసం ఉండదు కదా! ఇదే ఆమె ధర్మంలోని లోటు." (బుఖారీ: 1951).

తవాఫ్ చేయడం నిషిద్ధం

హజ్ సమయంలో ఆయిషా (ర) వారు బహిష్టు స్థితికి లోనైనప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆమెతో ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా ఇది అల్లాహ్ ఆదం కుమార్తెలపై (స్త్రీలపై) రాసి పెట్టిన విషయం. కావున హజ్ చేసేవారు చేసే పనులన్నీ నువ్వు కూడా చేయి, కానీ శుద్ధత (తహారా) పొందే వరకు మాత్రం కాబా గృహం చుట్టూ తవాఫ్ చేయవద్దు." (బుఖారీ: 305, ముస్లిం: 1211).

ఖుర్ఆన్ గ్రంథాన్ని (ముస్హఫ్) తాకడం నిషిద్ధం

అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: "పరిశుద్ధులు తప్ప దానిని (ఖుర్ఆన్‌ను) ఎవరూ తాకకూడదు." (అల్-వాఖియా: 79). అయితే, ప్రముఖ విద్వాంసుల అభిప్రాయం ప్రకారం, బహిష్టు (హైద్) స్థితిలో ఉన్న మహిళ ఖుర్ఆన్‌ను కంఠస్థం నుండి పఠించడం అనుమతించబడింది. కానీ జనాబత్ స్థితిలో ఉన్నవారు స్నానం (గుస్ల్) చేసే వరకు పఠించకూడదు. ఒకవేళ బహిష్టు లేదా ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) స్థితిలో ఉన్న మహిళ ఏదైనా ఆయత్ సరిచూసుకోవడానికి లేదా ఇతరులకు నేర్పించడానికి ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకవలసి వస్తే, చేతికి గ్లౌజులు (అడ్డు) వంటివి ధరించి తాకవచ్చు.

మసీదులో ఆగడం నిషిద్ధం

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నిశ్చయంగా నేను బహిష్టు స్థితిలో ఉన్నవారికి మరియు జనాబత్(లైంగిక అశుద్ధ) స్థితిలో ఉన్నవారికి మసీదును అనుమతించను." (అబూ దావూద్: 232). అయితే అవసరం నిమిత్తం మసీదు గుండా వెళ్ళడం లేదా ప్రవేశించడం అనుమతించబడింది. ఆయిషా (ర) వారు ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త ముహమ్మద్(స) వారు నాతో, "మసీదు నుండి నాకు నమాజు చాపను అందివ్వు" అని అన్నారు. అప్పుడు నేను, "నేను బహిష్టు స్థితిలో ఉన్నాను" అని మనవి చేయగా, దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నీ బహిష్టు నీ చేతుల్లో లేదు (అంటే తాకడం వల్ల అశుద్ధత అంటుకోదు)." (ముస్లిం: 298).

బహిష్టు (హైద్) వల్ల కలిగే అనివార్యతలు:

١
యవ్వన దశ
٢
విడాకులు ఇవ్వబడిన స్త్రీ ఇద్దత్ (సంతాప ప్రకటన, గర్భ నిర్ధారణ, సయోధ్యకు అవకాశం మరియు పునర్వివాహ అర్హత కోసం నిర్ణయించబడిన నిరీక్షణ కాలం.) పాటించడం.

యవ్వన దశ

యవ్వన దశకు చేరుకోవడంతోనే మనిషిపై ధర్మశాస్త్ర బాధ్యతలు ప్రారంభమవుతాయి. బాలికలు యవ్వన దశకు చేరుకున్నారనడానికి బహిష్టు ప్రారంభమవ్వడం అత్యంత ప్రధానమైన సూచన.

విడాకులు (తలాక్) పొందిన మహిళ తన ఇద్దత్ కాలాన్ని బహిష్టుల ద్వారానే లేక్ఖించబడుతుంది.

బహిష్టు అయ్యే అలవాటు ఉన్న మహిళకు విడాకులు (తలాక్) జరిగినప్పుడు, ఆమె ఇద్దత్ కాలం మూడు బహిష్టుల వరకు ఉంటుంది. అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: "విడాకులు ఇవ్వబడిన మహిళలు తమను తాము మూడు బహిష్టుల వరకు వేచి ఉంచుకోవాలి (ఇద్దత్ పాటించాలి)." (అల్-బఖరా: 228).

మహిళ బహిష్టు నుండి శుద్ధత (తహారా) పొందినట్లు తెలిపే సూచనలు

١
తెల్లబట్ట (తెల్లని స్రావం వెలువడటం)
٢
రక్తస్రావం ఆగిపోయి పొడిగా మారడం

తెల్లబట్ట/తెల్లని స్రావం

బహిష్టు ముగింపు రోజుల్లో మహిళ జననాంగం నుండి వెలువడే తెల్లని దారం వంటి స్రావం. ఇది ఆమె శుద్ధత (తహారా) పొందిందనడానికి ఒక సూచన.

రక్తస్రావం ఆగిపోవడం మరియు పొడిగా మారడం

మహిళ తన జననాంగంలో వస్త్రాన్ని (లేదా దూది వంటిది) ఉంచినప్పుడు, దానిపై ఎటువంటి రక్తపు మరకలు కానీ, మట్టి రంగు లేదా పసుపు రంగు స్రావాలు కానీ అంటకుండా శుభ్రంగా బయటకు రావడాన్ని పొడిగా మారడం అంటారు.

స్నానం (గుస్ల్) యొక్క ఫర్ద్‌లు (అనివార్యతలు)

స్నానానికి (గుస్ల్) రెండు విధి (ఫర్జ్) ఆచరణలు ఉన్నాయి: సంకల్పం (నియ్యత్) చేసుకోవడం మరియు వెంట్రుకలతో పాటు శరీరమంతటికీ నీరు అందేలా చేయడం. వెంట్రుకలు పల్చగా ఉన్నా లేదా దట్టంగా ఉన్నా, నీటిని వెంట్రుకల మొదళ్ళ వరకు, అంటే వాటి కింద ఉన్న చర్మం వరకు చేర్చడం అనివార్యం.

ముస్లిము మహిళ రుతుస్రావం మరియు జనాబత్ (లైంగిక అశుద్ధత) నుండి శుద్ధత పొందే స్నాన పద్ధతి

ఆయిషా (ర) వారు ఉల్లేఖించిన దాని ప్రకారం, అస్మా (ర) వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని బహిష్టు స్నానం గురించి అడిగారు. అప్పుడు వారు ఇలా సెలవిచ్చారు: "మీలో ఒకరు నీటిని మరియు రేగు ఆకుల (సిద్ర్) పొడిని తీసుకుని, చక్కగా శుద్ధత (తహారా) పొంది, ఆపై తలపై నీళ్లు పోసుకుని, తల కుదుళ్ల వరకు నీరు చేరేలా బాగా రుద్దాలి. ఆ తర్వాత ఒంటిపై నీళ్లు పోసుకోవాలి. చివరగా కస్తూరి పూసిన ఒక వస్త్రాన్ని (లేదా దూదిని) తీసుకుని దానితో శుద్ధి చేసుకోవాలి." అప్పుడు అస్మా (ర) వారు, "దానితో ఎలా శుద్ధి చేసుకోవాలి?" అని అడిగారు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆశ్చర్యంతో, "సుబ్'హాన అల్లాహ్! దానితో శుద్ధి చేసుకో" అని సెలవిచ్చారు. అప్పుడు ఆయిషా (ర) వారు మెల్లగా (అస్మాకు అర్థమయ్యేలా), "రక్తం అంటిన చోట దానితో తుడిచి శుభ్రం చేసుకో" అని చెప్పారు. తర్వాత ఆమె దైవప్రవక్త ముహమ్మద్(స) వారిని జనాబత్ స్నానం గురించి అడిగారు. అప్పుడు వారు ఇలా సెలవిచ్చారు: "నీటిని తీసుకుని పూర్తిగా శుద్ధత (తహారా) పొంది (వుదూ చేసి), ఆపై తలపై నీళ్లు పోసుకుని తల కుదుళ్ల వరకు నీరు చేరేలా రుద్దాలి. ఆ తర్వాత శరీరం అంతటా నీరు పోసుకోవాలి." దీనిపై ఆయిషా (ర) వారు ఇలా అన్నారు: "అన్సార్ మహిళలు ఎంత ఉత్తమమైన వారంటే, ధర్మ విషయాలను నేర్చుకోవడానికి వారి సిగ్గు ఏనాడూ అడ్డు రాలేదు." (బుఖారీ: 314, ముస్లిం: 332).

శరీరంలోని ఏ భాగానికైనా నీరు అందకుండా అడ్డుపడే ఏ పదార్థమైనా స్నానాన్ని (గుస్ల్) భంగపరుస్తుంది మరియు ఆ స్నానాన్ని అశుద్ధం చేస్తుంది. ఉదాహరణకు, మహిళలు గోళ్లకు రంగు (నెయిల్ పాలిష్) వేసుకోవడం వల్ల గోరుకు నీరు అందదు, లేదా చర్మంపై నీరు చేరకుండా అడ్డుపడే మరే ఇతర పదార్థం ఉన్నా స్నానం చెల్లదు.

పసుపు మరియు మట్టి రంగు స్రావాలు

మహిళ జననాంగం నుండి బహిష్టుకు ముందు లేదా తర్వాత కొన్ని స్రావాలు వెలువడుతుంటాయి. ఒకవేళ అవి బహిష్టుతో కలిసి (వెనువెంటనే) వస్తే, వాటిని బహిష్టుగానే పరిగణించాలి. అప్పుడు ఆమె నమాజు మరియు బహిష్టు కారణంగా నిషిద్ధమైన ఇతర పనులకు దూరంగా ఉండాలి. అయితే, ఇవి బహిష్టు కాలంతో సంబంధం లేకుండా (శుద్ధత తర్వాత) వస్తే, వాటికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. దీని గురించి ఉమ్మె అతియ్య (ర) వారు ఇలా ఉల్లేఖించారు: "మేము శుద్ధత (తహారా) పొందిన తర్వాత వెలువడే మట్టి రంగు మరియు పసుపు రంగు స్రావాలను ఏ విషయంగానూ (అంటే బహిష్టుగా) పరిగణించేవారం కాదు." (బుఖారీ: 326, అబూ దావూద్: 307 - పదాలు అబూ దావూద్‌వి).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి