ప్రస్తుత విభాగం : model
పాఠం హజ్ యొక్క అర్ధం మరియు దాని విశిష్ఠత
హజ్ యొక్క అర్ధం
హజ్ అనేది ఒక నిర్దిష్ట సమయంలో మక్కాలోని పవిత్ర కాబాగృహాన్ని సందర్శించడం మరియు ప్రవక్త ముహమ్మద్ (స) బోధించిన నిర్ధిష్ట ఆచరణాలను ఆచరించడం. ఈ ఆచరణాలలో ఇహ్రామ్ సంకల్పం చేయడం, కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం (తవాఫ్), సఫా మరియు మార్వా కొండల మధ్య ఏడు సార్లు నడవడం (సయీ), అరఫాత్ మైదానంలో నిలబడటం, మినా వద్ద రాళ్ళు రువ్వడం (జమరాత్) మరియు ఇతర ఆచరణలు ఉన్నాయి. హజ్ యొక్క ప్రయోజనాలు అనేకం: అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటించడం, హాజీలకు గొప్ప క్షమాపణ లభించడం, ముస్లింల మధ్య పరిచయాలు ఏర్పడటం, ధార్మిక నియమాలను నేర్చుకోవడం మరియు ఇతర ప్రయోజనాలు.
హజ్ యొక్క నియమం
హజ్ అనేది ఇస్లామ్ యొక్క మూల స్థంబాలలో ఒకటి, స్తోమత ఉన్న ప్రతి ఒక్క ముస్లిం పురుషుడు మరియు స్త్రీకు జీవితంలో ఒక సారి హజ్ చేయడం తప్పనిసరి. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి)". [అల్ ఇమ్రాన్: 97].
అబూ హురైరా (ర) వారి ఉల్లేఖనం: దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు మాకు ప్రసంగించారు మరియు ఇలా సెలవిచ్చారు, "ఓ ప్రజలారా! అల్లాహ్ మీపై హజ్‌ను తప్పనిసరి చేశాడు, కాబట్టి హజ్ చేయండి." ఒక సహాబీ ఇలా అడిగారు, "ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా, ప్రతి సంవత్సరం హజ్ చేయాలా?" ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. ఆ వ్యక్తి మూడు సార్లు ఇదే ప్రశ్నను అడిగాడు. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు, "నేను 'అవును' అని చెబితే, అది ప్రతి సంవత్సరం తప్పనిసరి అయ్యేది, మరియు మీరు చేయగలిగేవారు కాదు." (సహీహ్ ముస్లిం 1337)
స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయడం అనేది ప్రతి ఒక్క ముస్లిము పై ఉన్న విధి
హజ్ యొక్క సమయం
హజ్ చేయడానికి దానికంటూ ఒక ప్రత్యేక కాలం మరియు సమయం ఉన్నది
హజ్ కోసం ఉన్న ప్రత్యేకమైన కాలాలు
హజ్ యాత్రకు నిర్దిష్టమైన నెలలు ఉన్నాయి, వాటిలో మాత్రమే హజ్ యొక్క సంకల్పం (ఇహ్రామ్) చెల్లుతుంది. అవి: షవ్వాల్, ధుల్ ఖాదా మరియు ధుల్ హిజ్జా. హజ్ ఆచరణలు ధుల్ హిజ్జా నెలలో 8వ మరియు 13వ రోజుల మధ్య జరుగుతాయి. ధుల్ హిజ్జా ఇస్లామిక్ క్యాలెండర్‌లో 12వ నెల.
ఇవి హజ్ యాత్రికులు లేదా ఉమ్రా యాత్రికులు (మక్కా వెలుపలి నుండి వచ్చేవారు) ఇహ్రామ్ లేకుండా మక్కాలోకి ప్రవేశించలేని ప్రదేశాలు. మదీనా నుండి వచ్చే వారికి ఇహ్రామ్ ప్రదేశం ధుల్ హులైఫా. సిరియా నుండి వచ్చేవారికి అల్-జుహ్ఫా. నజద్ నుండి వచ్చేవారికి ఇహ్రామ్ స్థలం ఖర్న్ అల్-మనాజిల్. యెమెన్ నుండి వచ్చేవారికి యలమ్లమ్. ఇరాక్ నుండి వచ్చేవారికి ధాత్ ఇర్ఖ్. ఈ ప్రదేశాలు వారికి మరియు వారి మార్గంలో వచ్చే ఇతరులకు, హజ్ లేదా ఉమ్రా చేయాలనుకునే వారికి సంకల్ప (ఇహ్రామ్) ప్రదేశాలు. ఈ ప్రదేశాలను స్థానిక నిపుణులు మరియు ఆధునిక మ్యాపుల ద్వారా గుర్తించవచ్చు.
హజ్ ను తప్పనిసరి చేసే షరతులు
హజ్ కోసం ఉన్న మొదటి షరతు : ఇస్లాం
హజ్ చేయడం అనేది ముస్లిముకు తప్పనిసరి, అవిశ్వాసికి హజ్ తప్పనిసరి కాదు మరియు చేసినా చెల్లదు, ఎందుకంటే ఆరాధన యొక్క చెల్లుబాటు కోసం ఇస్లాం ఒక షరతు.
రెండవ షరతు : బుద్ధికుశలత
మతిస్థిమితం లేని వ్యక్తికి హజ్ తప్పనిసరి కాదు మరియు అతను చేసినా అది చెల్లదు. ఎందుకంటే హజ్ చెల్లుబాటు కావడానికి మరియు తప్పనిసరి కావడానికి స్పృహ (సరైన మానసిక స్థితి) ఒక షరతు. అలీ (ర) వారి ఉల్లేఖనం : ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "మూడు రకాల వ్యక్తులకు (దైవిక) కర్తవ్యం నుండి మినహాయింపు ఉంది: నిద్రపోతున్న వ్యక్తికి అతను మేల్కొనే వరకు, చిన్న పిల్లవాడికి అతను యుక్తవయస్సు వచ్చే వరకు, మరియు మతిస్థిమితం లేని వ్యక్తికి అతను స్పృహలోకి వచ్చే వరకు." (అబూ దావూద్ 4403).
మూడవ షరతు : యవ్వన దశలోకి ప్రవేశించి ఉండడం
అలీ (ర) వారి ఉల్లేఖనం: దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "మూడు రకాల వ్యక్తులకు (దైవిక) కర్తవ్యం నుండి మినహాయింపు ఉంది: నిద్రపోతున్న వ్యక్తికి అతను మేల్కొనే వరకు, చిన్న పిల్లవాడికి అతను యుక్తవయస్సు వచ్చే వరకు, మరియు పిచ్చివాడికి అతను స్పృహలోకి వచ్చే వరకు." (అబూ దావూద్ 4403). దీని ప్రకారం చిన్న పిల్లవాడిపై హజ్ తప్పనిసరి కాదు.
ఒక చిన్న పిల్లవాడు హజ్ చేస్తే, అది చెల్లుతుంది, కానీ అది ఇస్లాంలో తప్పనిసరి అయిన హజ్‌కి ప్రత్యామ్నాయం కాదు. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "ఒక చిన్న పిల్లవాడు హజ్ చేస్తే, అది అతనికి హజ్ అవుతుంది, అయితే యుక్తవయస్సు వచ్చిన తర్వాత, అతను మరొక హజ్ చేయవలసి ఉంటుంది." (ముస్తద్రక్ అల్-హాకీం 1769).
నాలుగవ షరతు : స్వతంత్రత
ఒక బానిసపై హజ్ తప్పనిసరి కాదు, ఎందుకంటే అతను తన యజమానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉంటాడు. అయితే, ఒక బానిస తన యజమాని అనుమతితో హజ్ చేస్తే, అది చెల్లుబాటు అవుతుంది, కానీ అది ఇస్లాంలో తప్పనిసరి అయిన హజ్‌కి ప్రత్యామ్నాయం కాదు. ఇబ్న్ అబ్బాస్ (ర) వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "ఒక బానిస హజ్ చేసి, తరువాత విముక్తి పొందితే, అతను మరొక హజ్ చేయవలసి ఉంటుంది." (అల్-బైహఖీ యొక్క అస్-సునన్ అల్-కుబ్రా 8613).
ఐదవ షరతు : స్తోమత
హజ్ చేయడానికి శారీరకంగా ఆరోగ్యవంతుడైన, ప్రయాణించగల సామర్థ్యం ఉన్న, మరియు హజ్ యాత్రకు అవసరమైన ఆహారం మరియు ప్రయాణ సామాగ్రీ కలిగి ఉన్న వ్యక్తిపై హజ్ తప్పనిసరి. స్త్రీ విషయంలో, హజ్ యాత్రలో ఆమెకు తోడుగా ఒక మహ్రమ్ (ఆమె వివాహం చేసుకోలేని బంధువు) ఉండటం కూడా అవసరం; ఎందుకంటే ఆమె మహరం లేకుండా హజ్ లేదా మరే ఇతర ప్రయాణం చేయడం అనుమతించబడదు.
మరియు అక్కడికి వెళ్లడానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. [అల్ ఇమ్రాన్: 97].
స్వయంగా హజ్ యాత్ర చేయలేని స్థితిలో ఉన్నవారు, తమ తరపున మరొకరిని పంపి హజ్ చేయించవచ్చు. ఇలాంటి అవకాశం శారీరకంగా అనారోగ్యం కారణంగా గానీ, వృద్ధాప్యం కారణంగా గానీ హజ్ చేయలేని వారికి ఉంటుంది. ఈ విషయమై దైవప్రవక్త ముహమ్మద్ (స) వారిని ఒక వ్యక్తి ఇలా అడిగారు, "ఓ ప్రవక్తా! నా తండ్రి ఇస్లాం స్వీకరించే నాటికి అప్పటికే చాలా వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు నేను అతని తరపున హజ్ చేయవచ్చా?" దానికి ప్రవక్త (స) ఇలా అడిగారు, "ఒకవేళ నీ తండ్రి మీద ఏదైనా అప్పు ఉండి, నువ్వు ఆ అప్పు తీర్చినట్లయితే, అది అతనికి ఉపయోగపడి ఉండేదా?" దానికి ఆ వ్యక్తి, "అవును" అని సమాధానమిచ్చాడు. అప్పుడు దైవప్రవక్త (స) వారు "అయితే, నీ తండ్రి తరపున నువ్వు హజ్ చేయి" అని సెలవిచ్చారు. (అహ్మద్ 1812).
హజ్ చేయడానికి స్తోమతకు సంబంధించిన పరిస్థితులు:
ఆరవ షరతు : హజ్ యాత్రలో స్త్రీకు తోడుగా మహ్రమ్ (భర్త లేదా ఆమెతో పెళ్లి చేసుకోవడం నిషిద్దమైన వ్యక్తి) ఉండడం వ్యక్తి
ఒక స్త్రీ హజ్ చేయాలంటే ఆమెకు తోడుగా ఒక మహ్రిం( పెళ్లి చేసుకోవడం నిషిద్దమైన బంధాలు)ఉండాలి, స్త్రీకు తోడుగా మహ్రిం లేని సందర్భంలో ఆమెకు హజ్ చేయడం తప్పనిసరి కాదు. మహ్రిం బంధాలు : ఉదాహరణకు, తండ్రి, తాత, కుమారుడు, మనవడు, సోదరులు, వారి కుమారులు, బాబాయి, మామాయి.
ఒక మహిళ తన భద్రతకు హామీ ఇచ్చే విధంగా మహ్రం లేకుండా హజ్ చేస్తే, ఆమె హజ్ అనేది చెల్లుతుంది మరియు ఆమెకు పూర్తి ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే, మహ్రం లేకుండా చేసిన విషయంలో ఆమె పాపం చేసినట్లు అవుతుంది
హజ్ యొక్క విశిష్ఠతలు
హజ్‌లో అనేక విశిష్ఠతలు మరియు సదాచారణలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
1. సదాచారణాలలోకెల్లా ఉత్తమమైన సదాచారణ
దైవప్రవక్త ముహమ్మద్ (స) వారిని "ఏ కర్మలు అత్యుత్తమమైనవి?" అని అడగబడినది, దానికి వారు ఇలా సమాధానమిచ్చారు: "అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం." తరువాత ఏ ఆచరణ అని అడిగినప్పుడు, వారు (స) ఇలా సెలవిచ్చారు: "అల్లాహ్ మార్గంలో పోరాటం." తరువాత ఏ ఆచరణ అని అడిగినప్పుడు ఇలా సెలవిచ్చారు: "స్వీకరింపబడిన హజ్" (బుఖారి 1519, ముస్లిం 83)
2. పాపాల క్షమాపనకు గొప్ప సమయం
దైవ ప్రవక్త(స)వారు ఇలా సెలవిచ్చారు : “ఎటువంటి లైంగిక సంబంద మాటలుగానీ, కార్యాలుగానీ దరిచేరనీయకుండా, అలాగే ఎటువంటి పాపాలు చేయకుండా కేవలం అల్లా యొక్క సంతుష్ఠత నిమిత్తమే హజ్ చేసిన వ్యక్తి తనతల్లికి అప్పుడే పుట్టిన బిడ్డలా (ఎటువంటి పాపాలు లేకుండా) తిరిగివస్తాడు”.
నరకం నుండి విముక్తికి గొప్ప సదవకాశం
ప్రవక్త (స ) ఇలా సెలవిచ్చారు : " ఒక దాసుడిని అల్లాహ్ నరకం నుండి విముక్తి చేసే రోజులలో అరఫా రోజు కంటే గొప్ప రోజు లేదు." (సహీహ్ ముస్లిం 1348)
4. దాని ప్రతిఫలం స్వర్గం
"సత్కార్యములతో కూడిన హజ్ కు స్వర్గము తప్ప వేరొక ప్రతిఫలము లేదు" అని ప్రవక్త ముహమ్మద్ (స) సెలవిచ్చారు. (బుఖారి 1773, ముస్లిం 1349). ఈ గొప్ప ప్రతిఫలాలు మరియు ఇతర ప్రయోజనాలు నిజాయితీతో, మంచి ఉద్దేశ్యంతో, స్వచ్ఛమైన హృదయంతో, దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి పద్దతిలో హజ్ చేసే వారికి మాత్రమే లభిస్తాయి.