నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం హజ్ యొక్క విధానం

దైవప్రవక్త (స) వారు తన అనుచర సమాజానికి హజ్ యొక్క విధానాన్ని నేర్పించారు, ఈ పాఠములో మనము ప్రవక్త (స) వారి సున్నతుకు అనుగుణంగా ఏ విధంగా హజ్ చేయాలో నేర్చుకుందాము.

  • హజ్ యొక్క మూడు రకాల గురించిన అవగాహన
  • హజ్ చేసే విధానం గురించిన అవగాహన

హజ్ యొక్క రకాలు

హజ్ యొక్క మొత్తం మూడు రకాలు ఉన్నాయి ; తమత్తో , ఖిరాన్ మరియు ఇఫ్రాద్. ఒక హాజీ ఈ మూడింటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకునవచ్చును.

ఆయిషా (ర) వారి ఉల్లేఖనం ; మేము ప్రవక్త (స) వారితో బయలుదేరాము. ఆ సమయంలో వారు(స) ఇలా సెలవిచ్చారు ; మీలో ఎవరైతే ఉమ్రా మరియు హజ్ యొక్క సంకల్పం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆ సంకల్పం చేసుకోండి, ఎవరైతే హజ్ యొక్క సంకల్పం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆ సంకల్పం చేసుకోండి, ఎవరైతే ఉమ్రా యొక్క సంకల్పం చేసుకోవాలనుకుంటున్నారో ఆ సంకల్పం చేసుకోండి (ముస్లిం 1211).

తమత్తో

తమత్తో హజ్ చేసే విధానము ; హజ్ మాసములలో అతడు ఉమ్రా యొక్క సంకల్పంతో ఇహ్రాం కట్టుకుంటాడు, తన సంకల్పాన్ని ఈ విధంగా అంటాడు : "లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్" . ఆ తరువాత ఉమ్రా చేసిన తరువాత ఇహ్రాం నుండి హలాల్ అయిపోతాడు, మరలా దిల్ హిజ్జ 8 వ తారీకున హజ్ యొక్క సంకల్పంతో మక్కా నుండి ఎహ్రాం ధరిస్తాడు, పండుగ రోజున జమ్రా ఉఖ్బా కు కంకర్లు రువ్వెంతవరకూ ఇహ్రాం స్థితిలోనే ఉంటాడు, అతడు ఖుర్బానీ చేయవలసి ఉంటుంది, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : ఎవరైతే హజ్జె తమత్తు చేయదలుచుకుంటే, అతడు తన శక్తిమేరకు ఖుర్బానీ ఇవ్వాలి [అల్-బఖరా: 196].

అల్ ఖిరాన్

ఖిరాన్ యొక్క విధానము : దీనిలో ఉమ్రా మరియు హజ్ రెండు సంకల్పాలూ ఒకే సారి చేసుకోవలసి ఉంటుంది, దాని సంకల్పం ఈ విధంగా అనాలి ; "లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్". ఆ తరువాత మక్కా చేరిన తరువాత తవాఫ్ చేసుకోవాలి, ఈ తవాఫ్ ను 'తవాఫ్ ఏ ఖుదూమ్' అంటారు, ఒక సయీ కూడా చేయవలసి ఉంటుంది, అయితే అతను ఈ సయీను ఈ తవాఫ్ ఏ ఖుదూమ్ తరువాత చేసుకోవచ్చును లేదా తరువాత చేయబోయే తవాఫ్ ఏ ఇఫాజా తరువాత కూడా చేసుకునే వెసులుబాటు ఉన్నది, మరియు అతను శిరోముండనం చేయడు మరియు ఎహ్రాం నుండి హలాహ్ అవ్వడు, నహర్ రోజున (10 వతారీకు లేదా పండుగ రోజు ) జమ్రా అఖబా కు కంకర్లు రువ్వే వరకూ తన ఎహ్రాం స్థితిలోనే ఉండిపోతాడు, ఖిరాన్ హజ్ చేసే వ్యక్తి ఖుర్బానీ కూడా ఇవ్వవలసి ఉంటుంది.

అల్ ఇఫ్రాద్

ఇఫ్రాద్ హజ్ చేసే విధానము ; ఇందులో కేవలం హజ్ యొక్క సంకల్పము చేసుకోవలసి ఉంటుంది, ఎహ్రాం సమయంలో ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి : "లబ్బైక హజ్జన్". ఆ తరువాత మక్కా చేరిన తరువాత తవాఫ్ చేసుకోవాలి, ఈ తవాఫ్ ను తవాఫ్ ఏ ఖుదూమ్ అంటారు, అతను ఒక సయీ కూడా చేయవలసి ఉంటుంది అయితే దీనిని ఈ తవాఫ్ ఏ ఖుదూమ్ తరువాత చేసుకోవచ్చును లేదా తరువాత చేయబోయే తవాఫ్ ఏ ఇఫాజా తరువాత కూడా చేసుకునే వెసులుబాటు ఉన్నది, ఇతను శిరోముండనం చేసుకోడు మరియు ఇహ్రాం నుండి హలాల్ అవ్వడు, నహర్ రోజున (10 వతారీకు లేదా పండుగ రోజు ) జమ్రా అఖబా కు కంకర్లు రువ్వే వరకూ తన ఎహ్రాం స్థితిలోనే ఉండిపోతాడు, ఖిరాన్ హజ్ చేసే వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడు.

హజ్ యొక్క విధానము

ఒక ముస్లిము దైవ ప్రవక్త (స) వారు చేసిన విధానములో హజ్ చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి, జాబిర్ (ర) వారి ఉల్లేఖనం : హజ్ లో దైవప్రవక్త (స) వారు పదవ తారీకున అనగా పండుగ రోజున తన ఒంటె పై నుండి జమారాత్ లో కంకర్లు రువ్వడం చూశాను, ఆ సమయంలో వారు జనాలకు ఇలా చెబుతూ ఉన్నారు : మీరు నా నుండి ఈ హజ్ విధానాన్ని తీసుకోవడానికి (నేర్చుకోవడానికి) నేను మీకు చేసి చూపిస్తున్నాను, ఈ హజ్ తరువాత వచ్చే ఏడాది నేను హజ్ చేయగలనో లేదో నాకు తెలియదు. (ముస్లిం : 1297)

ఇహ్రాం

హజ్ చేసే వ్యక్తి మీఖాత్ కు చేరుకున్న తరువాత ఎహ్రామ్ యొక్క సంకల్పం చేసుకోవాలనుకున్నపుడు తన సాధారణ వస్త్రాలను తీసివేసి స్నానము చేసి తన తలవెంట్రుకలకు మరియు గడ్డం యొక్క వెంట్రుకలకు సుగంధాన్ని పూసుకోవచ్చు, ఆ తరువాత ఎహ్రామ్ దుస్తులు ధరించి సంకల్పం చేసుకోవాలి. వదూ చేసి ఉంటారు కాబట్టి వదూ కు చెందిన రెండు రెకాతుల సున్నతు నమాజు చేసుకోవచ్చును. ప్రత్యేకించి నియ్యత్ కోసం ఆ సమయంలో ఎటువంటి నమాజు అనేది లేదు.

నమాజు తరువాత హజ్ ఆచరణలలో ప్రవేశించడానికి సంకల్పం చేసుకుంటాడు

١
తమత్తో హజ్ చేసే వ్యక్తి ఈ విధంగా సంకల్పం చేస్తాడు : “లబ్బైక అల్లాహుమ్మ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్”. ("ఓ అల్లాహ్! నేను తమత్తుగా ఉమ్రా చేస్తున్నాను, దాని తరువాత హజ్ కొనసాగిస్తాను.)
٢
ఇఫ్రాద్ హజ్ చేసే వ్యక్తి ఈ విధంగా సంకల్పం చేస్తాడు : “లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్” (హజ్ ఇఫ్రాద్ అనేది హజ్ మాత్రమే చేసే ఒక రకమైన హజ్, ఇందులో ఉమ్రా చేయబడదు).
٣
‘ఖారిన్ హజ్’ చేసే వ్యక్తి ఈ విధంగా సంకల్పం చేస్తాడు : “లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్ వ ఉమ్రతన్” (హజ్ మరియు ఉమ్రా రెండింటినీ కలిపి సంకల్పించుకుంటాడు)

ఆ తరువాత ఎక్కువగా ఇలా తల్బియా పలుకుతుందాలి: "లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నే'మత లక వల్ ముల్క్, లా షరీక లక్." (ఓ అల్లాహ్! నీ ఆహ్వానానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకు సాటి ఎవరూ లేరు సమస్త స్తుతి, అనుగ్రహం, రాజ్యం నీకే చెందుతాయి, నీకు సాటి ఎవరూ లేరు). పురుషులు తమ స్వరాన్ని పెంచి ఈ తల్బియాను పఠించాలి, అయితే స్త్రీలు ఇతర స్త్రీలు వినగలిగే విధంగా మాత్రమే పఠించాలి, పురుషులు వినకుండా ఉండాలి. ఇహ్రామ్‌లో ఉన్నప్పుడు, హాజీ ఇహ్రామ్ యొక్క నిషేధించబడిన వాటికి దూరంగా ఉండాలి.

2. మక్కాలో ప్రవేశించడం

హాజీ మక్కాలోకి ప్రవేశించే ముందు స్నానం చేయడం మంచిది. తర్వాత, తమత్తో ప్రకారం హజ్ చేసేవారు ఉమ్రా చేయడానికి మస్జిద్ అల్-హరామ్‌కు వెళ్లాలి. ఖిరాన్ లేదా ఇఫ్రాద్ ప్రకారం హజ్ చేసేవారు తవాఫ్ అల్-ఖుదూమ్ (మక్కా చేరుకున్న తర్వాత చేసే మొదటి తవాఫ్) చేయడం మంచిది.

3. తవాఫ్ (ప్రదక్షణం)

మస్జిద్ అల్-హరామ్‌లోకి ప్రవేశించేటప్పుడు, హాజీ తన కుడి పాదంతో మొదట అడుగుపెట్టి, మస్జిద్‌లోకి ప్రవేశించే దుఆ పఠించాలి. కాబా వద్దకు చేరుకున్న తర్వాత, తవాఫ్ (ప్రదక్షిణ) ప్రారంభించే ముందు తల్బియా పఠించడం ఆపాలి. పురుషులు తమ ఇహ్రామ్ వస్త్రం మధ్య భాగాన్ని కుడి చంక కింద ఉంచి, రెండు చివరలను ఎడమ భుజంపై ఉంచడం మంచిది.

అనంతరం, హాజీ తవాఫ్ (ప్రదక్షిణ) ప్రారంభించడానికి హజర్ అల్-అస్వాద్ వైపు వెళ్లి, తన కుడి చేతితో దానిని తాకి ముద్దు పెట్టుకోవాలి. అది సాధ్యం కాకపోతే, అతను దాని వైపు తన చేతితో సంజ్ఞ చేయవచ్చు. కాబాను తన ఎడమ వైపున ఉండేటట్లు, ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. పురుషులు మొదటి మూడు ప్రదక్షిణలలో రమ్ల్ చేయాలి. రమ్ల్ అంటే చిన్న అడుగులతో వేగంగా నడవడం.

యమనీ మూలకు చేరుకున్నప్పుడు, హాజీ దానిని ముద్దు పెట్టుకోకుండా కేవలం తాకాలి. అది సాధ్యం కాకపోతే, దాని వైపు సంజ్ఞ చేయకూడదు. యమనీ మూల మరియు హజర్ అల్-అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: “రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా ‘అదాబన్నార్.” (మా ప్రభూ! ఈ లోకంలో మాకు మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు మరియు నరక శిక్ష నుండి మమ్మల్ని రక్షించు).

హజ్ యాత్రికుడు హజ్ర్ అల్ అస్వద్ వద్దకు వచ్చిన ప్రతిసారీ తక్బీర్ చెబుతాడు, ఆపై తన తదుపరి తవాఫ్‌లో తనకు ఇష్టమైన ఏదైనా స్మరణ (జిక్ర్), దుఆ లేదా ఖురాన్ పఠనం చేస్తాడు.

ఏడు ప్రదక్షిణలు (తవాఫ్) పూర్తి చేసిన తర్వాత, హాజీ తన వస్త్రాన్ని పూర్తిగా కప్పుకుని, సాధ్యమైతే మఖామ్ ఇబ్రహీం వెనుక లేదా మస్జిద్‌లో ఎక్కడైనా రెండు రెకాతుల నమాజ్ చేయాలి. మొదటి రకాతులో, ఫాతిహా తర్వాత "ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్" (సూరా అల్-కాఫిరూన్) పఠించాలి మరియు రెండవ రెకాతులో, ఫాతిహా తర్వాత "కుల్ హువల్లాహు అహద్" (సూరా అల్-ఇఖ్లాస్) పఠించాలి.

4. సయీ

అనంతరం, హాజీ సఫా మరియు మర్వా మధ్య స‌యీ చేయడానికి వెళ్ళాలి. సఫా కొండను సమీపించినప్పుడు, ఈ క్రింది ఖురాన్ వచనాన్ని పఠించాలి: "ఇన్నస్-సఫా వల్-మర్వత మిన్ ష‌ఆ'ఇరిల్లాహ్." "నిశ్చయంగా, సఫా మరియు మర్వా అల్లాహ్ యొక్క చిహ్నాలలో ఒకటి."

సఫా వద్ద స‌యీ ప్రారంభమవుతుంది. హాజీ సఫా కొండపైకి ఎక్కి, కాబా వైపు తిరిగి, తన చేతులను పైకెత్తి అల్లాహ్‌ను స్తుతించి, దుఆలు చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు ఈ విధంగా వేడుకునేవారు: "లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు, అంజజ వఅదహు, వ నసర అబ్దహు, వ హజమల్ అహ్‌జాబ వహ్’దహు ." "అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయనకే సర్వ అధికారం, సర్వ స్తుతులు, ఆయన అన్నింటిపై అధికారం కలిగినవాడు. అల్లాహ్ తప్ప వేరే దైవం లేడు, ఆయన ఒక్కడే, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు, తన దాసుడికి విజయం ప్రసాదించాడు, శత్రు సమూహాలను ఒంటరిగా ఓడించాడు." హాజీ తనకు కావలసిన విధంగా దుఆలు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను మూడు సార్లు పునరావృతం చేయాలి.

అప్పుడు అతను సఫా నుండి మర్వా వైపు నడుస్తాడు, మార్గంలో ఆకుపచ్చ లైట్లు ఉన్న చోట పురుషులకు వీలైనంత వేగంగా పరిగెత్తడం మంచిది, అయితే స్త్రీలు మొత్తం ప్రయాణంలో నడుస్తారు మరియు రెండు లైట్ల మధ్య పరుగెత్తవలసిన అవసరం లేదు.

అతను మర్వా చేరుకునే వరకు నడుస్తూనే ఉంటాడు, దానిపైకి ఎక్కి, ఖిబ్లా వైపు తిరిగి, తన చేతులను పైకెత్తి, సఫా పైన చెప్పినదే చెబుతాడు, కానీ ఈసారి ఆయత్ చదవడు లేదా "నేను అల్లాహ్ ప్రారంభించిన దానితో ప్రారంభిస్తాను" అని చెప్పడు.

ఆ తర్వాత అతను మర్వా నుండి దిగి సఫా వైపు నడుస్తాడు, రెండు ఆకుపచ్చ లైట్లను చేరుకున్నప్పుడు పరిగెత్తుతాడు, మరియు సఫా వద్ద అతను మర్వా వద్ద చేసినట్లే చేస్తాడు. అతను ఏడు రౌండ్లు పూర్తి చేసే వరకు ఇది కొనసాగుతుంది, వెళ్ళడం ఒక రౌండు మరియు తిరిగి రావడం ఒక రౌండుగా పరిగణించబడుతుంది. సాధ్యమైనంత వరకు, అతను తన సయీలో ధిక్ర్ (అల్లాహ్ యొక్క స్మరణ) మరియు దుఆ (వేడుకోలు) చేయడం మంచిది.

తమత్తో హజ్ (ఉమ్రా చేసి హజ్‌లోకి ప్రవేశించే వ్యక్తి) చేసే వ్యక్తికి ఉమ్రా మరియు హజ్ రెండింటికీ సయీ చేయడం తప్పనిసరి. అయితే, ఖిరాన్ (ఉమ్రా మరియు హజ్ రెండింటినీ కలిపి చేసే వ్యక్తి) మరియు ఇఫ్రాద్ (హజ్ మాత్రమే చేసే వ్యక్తి) వారికి ఒకే ఒక్క సయీ సరిపోతుంది. వారు దీన్ని మొదటి తవాఫ్ తర్వాత లేదా ఇఫాదా తవాఫ్ తర్వాత చేయవచ్చు.

5. శిరోముండనం మరియు జుట్టు కత్తిరించుకోవడం

హజ్ యాత్రికుడు సయీ పూర్తి చేసిన తర్వాత, శిరోముండనం చేయించుకోవాలి లేదా కత్తిరించుకోవాలి. తమత్తో హజ్ చేసే వ్యక్తి అయితే (ఉమ్రా చేసి హజ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి), శిరోముండనం చేయించుకోవడం ఉత్తమం, అయితే హజ్ కోసం జుట్టును తగ్గించుకోవడం కూడా అతడికి ఆమోదయోగ్యమైనదే. స్త్రీ తన జుట్టును వేలు కొనంత పొడవు కత్తిరించుకోవాలి. తమత్తో హజ్ చేసే వ్యక్తి అలా చేసినట్లయితే, అతని ఉమ్రా పూర్తయింది మరియు ఇహ్రామ్ స్థితి కారణంగా అతనికి నిషేధించబడిన ప్రతిదీ అతనికి అనుమతించబడుతుంది. అయితే, ఇఫ్రాద్ (హజ్ మాత్రమే చేసే వ్యక్తి) లేదా ఖిరాన్ హజ్ (ఉమ్రా మరియు హజ్ రెండింటినీ కలిపి చేసే వ్యక్తి) చేసే వ్యక్తి అయితే, సయీ తర్వాత శిరోముండనం చేసుకోడు లేదా కత్తిరించుకోడు మరియు ఇహ్రామ్‌ స్థితిలోనే ఉంటాడు.

తర్వియా రోజు (దిల్ హిజ్జ 8 వ తారీకు)

తర్వీయహ్ రోజు అంటే దుల్-హిజ్జా నెల ఎనిమిదవ తారీకు. హజ్ యొక్క ఆచరణలు ఈ రోజున ప్రారంభమవుతాయి. తమత్తో హజ్ చేసే వ్యక్తి (ఉమ్రా చేసి హజ్‌లోకి ప్రవేశించే వ్యక్తి) ఉదయం తాను ఉన్న ప్రదేశంలోనే ఉదయం దుహా సమయంలో హజ్ కోసం ఇహ్రామ్‌ స్థితిలోకి ప్రవేశిస్తారు. అతను స్నానం చేస్తాడు, సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడు, ఇహ్రామ్ దుస్తులు ధరిస్తాడు. ఆ తరువాత, అతను హజ్ కోసం ఇహ్రామ్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుని, "లబ్బైక అల్లాహుమ్మ హజ్జన్" (నేను మీ సేవలో ఉన్నాను, ఓ అల్లాహ్, హజ్ చేయడానికి) అని సంకల్పిస్తాడు. ఇఫ్రాద్ (హజ్ మాత్రమే చేసే వ్యక్తి) మరియు ఖిరాన్ (ఉమ్రా మరియు హజ్ రెండింటినీ కలిపి చేసే వ్యక్తి) వారు తమ మునుపటి ఇహ్రామ్ స్థితిలోనే ఉంటారు. అప్పుడు హజ్ యాత్రికుడు మధ్యాహ్నం ముందు మినాకు బయలుదేరి, అక్కడే ఉండి రాత్రి గడుపుతాడు. అతను అక్కడ జుహ్ర్, అసర్, మఘ్రిబ్ మరియు ఇషా నమాజులు చేస్తాడు, మరియు నాలుగు రకాత్‌ల నమాజులను రెండుగా కుదించి చదువుతాడు, కానీ రెండు నమాజులను జమా చేయడు. అతను తొమ్మిదవ రోజు తెల్లవారుజామున (ఫజ్ర్) నమాజును కూడా మినాలోనే చేస్తాడు మరియు తన సమయాన్ని తల్బియా , ధిక్ర్ (అల్లాహ్‌ను స్మరించుకోవడం) మరియు ఖురాన్ పఠనం చేయడంలో గడుపుతాడు.

7. అరఫా రోజు

దుల్-హిజ్జా నెల తొమ్మిదవ రోజు అయిన అరఫా రోజున సూర్యుడు ఉదయించినప్పుడు, హజ్ యాత్రికుడు మినా నుండి అరఫాకు శాంతంగా, ప్రశాంతంగా నడుస్తాడు, అల్లాహ్‌ను స్మరించుకుంటూ మరియు తల్బియా చెప్పుతూ సాగుతాడు. అరఫా మైదానంలో మధ్యాహ్నం అయిన తర్వాత, జుహ్ర్ మరియు అసర్ నమాజులను ముదస్తుగా కలిపి (జమ తఖ్దీమ్), కుదించి(ఖసర్) ఒకేసారి చేస్తాడు. ఆ తర్వాత, తన సమయాన్ని ధిక్ర్ (అల్లాహ్‌ను స్మరించుకోవడం), దుఆ (వేడుకోలు) మరియు అల్లాహ్‌కు విన్నవించుకోవడంలో గడుపుతాడు. ఖిబ్లా వైపు తన చేతులను పైకెత్తి, తను కోరిన విధంగా వెడుకుంటాడు.

ఆయిషా(ర) వారి ఉల్లేఖనం : దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు: "అల్లాహ్ తన దాసులను నరకం నుండి విముక్తి చేసే విషయంలో అరఫా రోజు కన్నా మించిన రోజు లేదు" (ముస్లిం 1348).

అరఫాలో ఉండవలసిన సమయం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించినప్పుడు, హజ్ యాత్రికులు ముజ్‌దలిఫాకు బయలుదేరుతారు. ఈ అరఫా సమయాన్ని కోల్పోయిన ఎవరైనా, పదవ రోజు తెల్లవారుజాముకు (ఫజర్ సమయం ప్రారంభం అవడానికి) ముందు అరఫాలో చేరుకుంటే - ఒక్క క్షణం అయినా సరే - వారు హజ్‌ను పొందినట్లే, వారి అరఫాత్ లో ఉండడం అనేది కూడా చెల్లుతుంది. అయితే, ఫజర్ సమయం ప్రారంభం అవడానికి ముందు అరఫాలో చేరుకోలేని వారు హజ్‌ను కోల్పోతారు.

8. ముజ్దలీఫాలో

హజ్ యాత్రికుడు ముజ్‌దలిఫా చేరుకున్నప్పుడు, అతను మఘ్రిబ్ మరియు ఇషా నమాజులను ఒకే అజాను మరియు రెండు ఇఖామాలతో కుదించి(ఖసర్), కలిపి(జమా)చేస్తాడు. అతను ముజ్‌దలిఫాలో రాత్రి గడుపుతాడు, మరియు ఫజ్ర్ నమాజు చేస్తాడు. ఆ తరువాత, పూర్తిగా తెల్లవారే వరకు ఖిబ్లా వైపు తన చేతులను పైకెత్తి, అల్లాహ్‌ను స్మరిస్తాడు మరియు వేడుకుంటాడు.

9. ఖుర్బానీ రోజు

దుల్-హిజ్జా పదవ రోజున పగటి వెలుగు ప్రారంభమైనప్పుడు మరియు పూర్తిగా తెల్లవారినప్పుడు, హజ్ యాత్రికుడు సూర్యుడు ఉదయించే ముందు మినాకు వెళ్తాడు. నడిచే సమయంలో, అతను ఏడు చిన్న గులకరాళ్లను సేకరిస్తాడు, ప్రతి ఒక్కటి సెనగ గింజ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. అతను మినా చేరుకున్నప్పుడు, మక్కాకు దగ్గరగా ఉన్న జమ్రా అల్-అఖబా వద్ద ఏడు గులకరాళ్లు విసురుతాడు, ప్రతి రాయిని అల్లాహ్‌ను స్తుతిస్తూ అల్లాహు అక్బర్ అని చెబుతూ విసురుతాడు. అది పూర్తయిన తర్వాత, అతను తన జంతువు యొక్క ఖుర్బానీ ఇస్తాడు, ఆపై శిరోముండనం చేసుకుంటాడు లేదా కత్తిరించుకుంటాడు. స్త్రీలు వేలు కొనంత పొడవు తమ జుట్టును కత్తిరించుకుంటారు. ఆ తరువాత హజ్ యాత్రికుడు తవాఫ్ అల్-ఇఫాదా చేయడానికి సుగంధ ద్రవ్యాలు పూసుకుని మక్కాకు వెళ్ళడం మంచిది, ఈ తవాఫ్ అల్-ఇఫాదా హజ్ యొక్క మూల స్థంబాలలో ఒకటి తర్వాత, అతను సయీ (సఫా మరియు మర్వా మధ్య నడక) చేస్తాడు. (తవాఫ్ అల్-ఇఫాదా అదే రోజు కాకుండా తరువాత కూడా చేసుకోవచ్చును). ఆ తర్వాత, అతను మినాకు తిరిగి వెళ్లి, పదకొండవ రాత్రి అక్కడే గడుపుతాడు.

తష్రీక్ రోజులు (11, 12, 13 తారీకులు)

హజ్ యాత్రికుడు తష్రీఖ్ రోజులలో దుల్-హిజ్జా 11, 12 మరియు 13 న మినాలో రాత్రి గడపడం తప్పనిసరి. మరియు వారు ఆలస్యంగా బయలుదేరాలనుకుంటే (అనగా 13 తరువాత బయలు దేరాలనుకుంటే) 13వ తేదీన కూడా రాత్రి గడపవచ్చు. సూర్యుడు అస్తమించిన తర్వాత, వారు మూడు జమరత్‌ల వద్ద రాళ్లు రువ్వాలి.

జమరాత్ వద్ద కంకర్లు విసిరే పద్ధతి

అతను మొదటి జమ్రాను (మస్జిద్ అల్-ఖైఫ్‌కు దగ్గరగా ఉన్నది) వరుసగా ఏడు రాళ్ళను కొడతాడు, ప్రతి రాయి విసిరేటపుడు"అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పఠిస్తాడు. ఆ తరువాత అక్కడ కొంచెం ముందుకు వెళ్లి, తనకు నచ్చిన విధంగా దీర్ఘంగా దుఆ చేస్తాడు. తర్వాత, అతను మధ్య జమ్రా వద్ద వరుసగా ఏడు రాళ్లను కొడతాడు, ప్రతి రాయి విసిరినప్పుడు "అల్లాహు అక్బర్" అని పఠిస్తాడు. అప్పుడు అతను ఎడమ వైపుకు తిరిగి, ఖిబ్లా (ప్రార్థన దిశ) వైపు తన చేతులను పైకెత్తి దుఆ చేస్తాడు. చివరగా, అతను జమ్రా అల్-అఖబా వద్ద వరుసగా ఏడు రాళ్లను విసురుతాడు, ప్రతి రాయి విసిరినప్పుడు "అల్లాహు అక్బర్" అని పఠిస్తాడు, ఆపై అక్కడి నుండి వెళ్లిపోతాడు, ఆ తర్వాత దుఆ చేయడు.

పన్నెండవ రోజు రాళ్లు రువ్వడం పూర్తయిన తర్వాత, హజ్ యాత్రికుడు మినా నుండి ముందుగానే బయలుదేరవచ్చు లేదా పదమూడవ రాత్రి అక్కడే ఉండి, మధ్యాహ్నం తర్వాత మళ్లీ మూడు జమరత్‌ల వద్ద రాళ్లు రువ్వవచ్చు. ఆలస్యంగా బయలుదేరడం మంచిది.

వీడ్కోలు తవాఫు

హజ్ యాత్రికుడు మక్కా నుండి తన స్వదేశానికి బయలుదేరాలనుకుంటే, వీడ్కోలు తవాఫ్ చేయకుండా బయలుదేరకూడదు. ప్రయాణం ప్రారంభించే ముందు, వీడ్కోలు తవాఫ్‌ను కాబాతో తన చివరి వీడ్కోలుగా చేసుకోవాలి. ఇబ్న్ అబ్బాస్ (ర) వారి ఉల్లేఖనం, "ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: 'కాబాతో చివరి వీడ్కోలు తవాఫ్ అయ్యే వరకు ఎవరూ బయలుదేరకూడదు.'" (ముస్లిం 1327). అయితే, స్త్రీకి ఋతుస్రావం అయితే ఈ తవాఫ్ నుండి మినహాయింపు ఉంటుంది.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి