నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం సున్నత్ గ్రంథస్థం మరియు దాని ముఖ్య గ్రంథాలు:

ఇస్లామీయ విద్వాంసులు సున్నత్‌ను గ్రంథస్థం చేయడంలో విశేషమైన శ్రద్ధ కనబరిచారు. వారు దానిని కంఠస్థం చేయడంలో, అందులోని సహీహ్ (ప్రామాణికమైనవి) మరియు సఖీమ్ (బలహీనమైనవి) హదీసులను వేరు చేయడంలో, మరియు వాటిని ఉల్లేఖించిన వారి (రావీల) చరిత్రను వివరించడంలో తమ జీవితాలను అంకితం చేశారు; మానవ చరిత్రలోనే దీనికి సాటివచ్చేది మరొకటి లేదు. ఈ పాఠంలో మీరు సున్నత్ గ్రంథస్థం అంటే ఏమిటి, దాని దశలు మరియు సున్నత్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రామాణిక గ్రంథాల గురించి తెలుసుకుంటారు.

  • దైవప్రవక్త సున్నత్ గ్రంథస్థం చేయబడిన దశలను తెలుసుకోవడం.
  •  ప్రధాన హదీసు గ్రంథాలను గుర్తించడం.
  •  ఒక హదీసు యొక్క ప్రామాణికతను (సహీహ్) లేదా బలహీనతను (జఈఫ్) తెలుసుకునే విధానాన్ని గ్రహించడం.
  

దైవప్రవక్త సున్నత్ గ్రంథస్థం చేయడం.

ఇస్లామీయ విద్వాంసులు సున్నత్‌ను గ్రంథస్థం చేయడంలో విశేషమైన శ్రద్ధ కనబరిచారు. వారు దానిని సంరక్షించడంలో, అందులోని సహీహ్ (ప్రామాణికమైనవి) మరియు సఖీమ్ (బలహీనమైనవి) హదీసులను వేరు చేయడంలో, మరియు వాటిని ఉల్లేఖించిన వారి (రావీల) స్థితిగతులను వివరించడంలో తమ జీవితాలను అంకితం చేశారు; మానవ చరిత్ర మొత్తంలో దీనికి సాటివచ్చేది మరొకటి లేదు.

దైవప్రవక్త సున్నత్ గ్రంథస్థం యొక్క అర్థం:

దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రవచనాలు, ఆచరణలు లేదా ఆయన అంగీకారాలను లిఖితపూర్వకంగా నమోదు చేయుట మరియు వాటిని పుస్తకాలుగా, గ్రంథాలుగా నమోదుచేయడం.

దైవప్రవక్త హదీసుల లేఖనం మరియు సున్నత్ గ్రంథస్థ ప్రక్రియ క్రింది విధంగా వివిధ దశలలో సాగింది:

١
మొదటి దశ: ప్రవక్త (స) మరియు వారి అనుచరుల (సహాబాల) కాలంలో లేఖనం.
٢
రెండవ దశ: తాబయీన్ల కాలం చివరిలో హదీసుల గ్రంథస్థం.
٣
మూడవ దశ: సున్నత్‌ను వర్గీకరించబడిన మరియు క్రమబద్ధీకరించబడిన గ్రంథాల రూపంలో కూర్చడం.
٤
నాలుగవ దశ: ప్రవక్త (స) హదీసులను ఇతర అంశాలతో కలపకుండా, ప్రత్యేకంగా వర్గీకరించి, సేకరించి మరియు క్రమబద్ధీకరించిన దశ.

మొదటి దశ:

ప్రవక్త (స) మరియు వారి అనుచరుల (సహాబాల) కాలంలో లేఖనం, ఇది హిజ్రీ మొదటి శతాబ్దంలో జరిగింది. ఇస్లాం ప్రారంభ కాలంలో హదీసులు ఖుర్ఆన్‌తో కలిసిపోతాయనే ఉద్దేశంతో ప్రవక్త (స) తన ప్రవచనాలను వ్రాయకూడదని వారించారు.

అబూ సయీద్ అల్-ఖుద్రీ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నా నుండి (ఖుర్ఆన్ తప్ప మరేదీ) వ్రాయకండి. నా నుండి ఖుర్ఆన్ కాకుండా మరేదైనా వ్రాసి ఉంటే దానిని తుడిచివేయండి. నా గురించి (నేను చెప్పిన విషయాలను ) ఇతరులకు తెలియజేయండి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు." - ముస్లిము (3004).

దైవప్రవక్త ﷺ వారి హదీసులు ప్రారంభంలో కంఠస్థం చేయబడేవి మరియు మౌఖికంగా ఒకరి నుండి ఒకరికి అందజేయబడేవి. ఆ తర్వాత, ప్రవక్త ﷺ వారు కొంతమంది సహాబాలకు (అనుచరులకు) వాటిని వ్రాయడానికి అనుమతించారు.

అబ్దుల్లా బిన్ అమ్ర్(ర) కథనం ప్రకారం: "నేను దైవప్రవక్త ముహమ్మద్(స) వారి నుండి విన్న ప్రతి విషయాన్ని కంఠస్థం చేయాలనే ఉద్దేశంతో వ్రాసుకునేవాడిని. అయితే ఖురేష్ వారు నన్ను వారించి ఇలా అన్నారు: 'నువ్వు విన్న ప్రతి విషయాన్ని వ్రాస్తున్నావా? దైవప్రవక్త (స) కూడా ఒక మనిషే కదా, ఆయన కోపంలోనూ మరియు సంతోషంలోనూ మాట్లాడుతుంటారు.' దాంతో నేను వ్రాయడం ఆపివేసి, ఈ విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి తెలియజేశాను. అప్పుడు ఆయన తన వేలితో తన నోటి వైపు చూపిస్తూ ఇలా సెలవిచ్చారు: 'నువ్వు వ్రాయి, నా ప్రాణం ఎవరి చేతిలో అయితే ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా! ఈ (నోటి) నుండి సత్యం తప్ప మరేదీ వెలువడదు'." - సునన్ అబూ దావూద్ (3646).

వలీద్ బిన్ ముస్లిం ఉల్లేఖించిన కథనంలో ఇమామ్ ఔజాయీ ఇలా తెలిపారు: అబూ హురైరా (ర) ఉల్లేఖించిన ప్రకారం, "అల్లాహ్ తన ప్రవక్త (స) కు మక్కా విజయాన్ని ప్రసాదించినప్పుడు, ఆయన ప్రజల మధ్య నిలబడి అల్లాహ్‌ను స్తుతించి, కొనియాడారు. (తరువాత అబూ హురైరా ఆ ప్రసంగాన్ని ప్రస్తావించి ఇలా అన్నారు:) అప్పుడు యెమెన్ నివాసి అయిన అబూ షా అనే వ్యక్తి నిలబడి: 'ఓ దైవప్రవక్తా! ఇది నా కొరకు వ్రాసి ఇవ్వండి' అని కోరారు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ (స): 'అబూ షా కొరకు వ్రాసి ఇవ్వండి' అని ఆజ్ఞాపించారు." వలీద్ ఇలా అన్నారు: నేను ఇమామ్ ఔజాయీని "ఓ దైవప్రవక్తా! నా కొరకు వ్రాసి ఇవ్వండి" అన్న ఆయన మాటల అర్థం ఏమిటి? అని అడగగా, ఆయన (ఔజాయీ): "దైవప్రవక్త ముహమ్మద్ (స) నుండి ఆయన విన్న ఆ ప్రసంగాన్ని ఉద్దేశించి అలా అన్నారు" అని బదులిచ్చారు. - బుఖారీ (2434), ముస్లిము (1355).

రెండవ దశ

హిజ్రీ రెండవ శతాబ్దంలో తాబయీన్ల కాలం ముగిసే సమయానికి హదీసుల సేకరణ జరిగింది. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి సున్నత్‌ను సర్వసాధారణంగా గ్రంథస్థం చేయడం ఈ కాలపు ప్రత్యేకత, అయితే అప్పట్లో వీటికి ఒక నిర్దిష్టమైన అమరిక లేదు. ఈ విషయంలో మొట్టమొదటగా చొరవ తీసుకున్నది అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ) వారు. వీరు ఇమామ్ ఇబ్న్ షిహాబ్ అజ్-జుహ్రీ మరియు అబూ బకర్ బిన్ హజ్మ్ అను ఇద్దరు ఇమాములను సున్నత్‌ను సేకరించవలసిందిగా ఆదేశించారు. అంతేకాకుండా, "జ్ఞానం అంతరించిపోతుందని, విద్వాంసులు కనుమరుగవుతారని నేను భయపడుతున్నాను; కావున దైవప్రవక్త ముహమ్మద్(స) వారి హదీసులను పరిశీలించి, వాటిని సేకరించి భద్రపరచండి" అని వివిధ ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ఆదేశానుసారం ఇమామ్ జుహ్రీ (రహ) వారు హదీసులను గ్రంథస్థం చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఇది సాధారణంగా సున్నత్ మరియు హదీసుల సేకరణకు ఆరంభంగా నిలిచింది.

రెండవ దశ

సున్నత్‌(ప్రవక్త వచనాలు మరియు ఆచరణలు)ను క్రమపద్ధతిలో వివిధ గ్రంథాలుగా రూపొందించడం జరిగింది. దీనిని రెండు విధాలుగా వర్గీకరించారు: మొదటిది, విశ్వాసం (ఈమాన్), జ్ఞానం (ఇల్మ్), శుద్ధత (తహారత్), నమాజు (సలాత్) వంటి అంశాల ఆధారంగా అధ్యాయాలుగా (అబ్వాబ్) విభజించడం. రెండవది, ముసానీద్ పద్ధతి. ఇందులో నివేదించిన వారి ఆధారంగా క్రమపద్ధతిలో పేర్కొంటారు; ఉదాహరణకు మొదట అబూ బకర్ (ర) వారి ముస్నద్, ఆపై ఉమర్ (ర) వారి ముస్నద్ - ఈ విధంగా హదీసులను పొందుపరిచారు.

ఈ దశలో ఇమామ్ మాలిక్ బిన్ అనస్ (రహ) వారి ముత్తా (ముఅత్తా) గ్రంథం రూపొందించబడింది. ఈ కాలపు ప్రత్యేకత ఏమిటంటే, హదీసులను ఒక క్రమపద్ధతిలో అమర్చడం మరియు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి అమృతవాక్కులతో పాటు సహాబాల (ర) మరియు తాబయీన్ల ప్రవచనాలు, అలాగే వారి ధర్మతీర్పులను (ఫత్వాలను) కలిపి పొందుపరచడం.

నాలుగవ దశ

దైవప్రవక్త ముహమ్మద్(స) వారి హదీసులను మాత్రమే ప్రత్యేకంగా గ్రంథస్థం చేయడం, సహాబాల (ర) మరియు తాబయీన్ల ప్రవచనాలను వాటితో కలపకుండా (అవసరమైనంత మేరకు తప్ప) విడిగా సేకరించి, అమర్చడం ఈ దశ యొక్క ప్రత్యేకత. ఈ దశ క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో (హిజ్రీ మూడవ శతాబ్దపు ఆరంభంలో) మొదలైంది. ఈ కాలంలో వెలువడిన ప్రసిద్ధ గ్రంథాలలో ఇమామ్ అహ్మద్ వారి ముస్నద్, అల్-హుమైదీ వారి ముస్నద్ వంటివి ముఖ్యమైనవి.

ఆపై క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దపు మధ్య కాలంలో (హిజ్రీ మూడవ శతాబ్దపు మధ్యలో) హదీసుల సేకరణ దాని గమ్యాన్ని చేరుకుంది. ఆ సమయంలోనే ఇమామ్ బుఖారీ (రహ) వారు సహీహ్ అల్-బుఖారీని, ఇమామ్ ముస్లిమ్ (రహ) వారు సహీహ్ ముస్లిమ్‌ను రచించారు. అలాగే సునన్ అబూ దావూద్, తిర్మిది, నసాయి, ఇబ్న్ మాజా, సునన్ అల్-దారిమీ వంటి ప్రసిద్ధ హదీసు గ్రంథాలు ఈ కాలంలోనే రూపొందించబడ్డాయి.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారి సున్నత్ కు సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారి సున్నత్‌కు సంబంధించిన అనేక గ్రంథాలలో ఆరు గ్రంథాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి. అవి: సహీహ్ అల్-బుఖారీ, సహీహ్ ముస్లిం, అలాగే సునన్ అబూ దావూద్, ఇబ్న్ మాజా, నసాయి మరియు తిర్మిది.

సున్నత్ గ్రంథాలలో సునన్ అల్-దారిమీ, ముస్నద్ ఇమామ్ అహ్మద్ మరియు ముఅత్తా ఇమామ్ మాలిక్ కూడా ప్రసిద్ధి చెందాయి.

ఆరు హదీసు గ్రంథాల పరిచయం:

సమస్త ముస్లిం సమాజం ఏకగ్రీవంగా ఆమోదించిన అత్యంత ప్రసిద్ధ సున్నత్ గ్రంథాలు ఆరు, అవి:

సహీహ్ అల్ బుఖారీ (మరణం: హిజ్రీ 256)

ఇది దైవప్రవక్త ముహమ్మద్(స) వారి నుండి రచయితకు అందిన విశ్వాసాలు, ఆరాధనలు, లావాదేవీలు, యుద్ధాలు, ఖుర్ఆన్ వ్యాఖ్యానం మరియు విశిష్టతలకు సంబంధించిన అన్ని హదీసులను సేకరించిన సమగ్ర గ్రంథాలలో ఒకటి. ఇందులో రచయిత కేవలం ప్రామాణికమైన హదీసులనే పొందుపరచడానికి కట్టుబడి ఉన్నారు. పవిత్ర ఖుర్ఆన్ తర్వాత అత్యంత ప్రామాణికమైన గ్రంథం ఇదే.

2. సహీహ్ ముస్లిం (మరణం: హిజ్రీ 261)

ఇది కూడా అత్యంత ప్రామాణికమైన మరియు సమగ్రమైన హదీసు గ్రంథాలలో ఒకటి. రచయిత ఇందులో కేవలం విశ్వసనీయమైన హదీసులనే సేకరించడానికి కట్టుబడి ఉన్నారు. అయితే, హదీసుల ప్రామాణికతను నిర్ధారించే విషయంలో వీరి నిబంధనలు ఇమామ్ బుఖారీ (ర) వారి నిబంధనల కంటే కొంత సరళంగా ఉంటాయి. అందువల్ల, సహీహ్ బుఖారీ తర్వాత ఇది రెండవ అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతుంది.

3. సునన్ అబూ దావూద్ (మరణం: హిజ్రీ 275)

ఇది ప్రధానంగా ఇస్లామీయ నియమావళి (ఫిఖ్) అధ్యాయాల క్రమంలో క్రమబద్ధంగా కూర్చబడిన ప్రముఖ సునన్ గ్రంథాలలో ఒకటి. రచయిత తన గ్రంథంలో సహీహ్ మరియు హసన్ స్థాయికి చెందిన ప్రామాణిక హదీసులను మాత్రమే సేకరించారు. అత్యంత అరుదైన మరియు అనివార్యమైన సందర్భాల్లో తప్ప, బలహీనమైన (దఈఫ్) హదీసులను ఇందులో ఎక్కడా ప్రస్తావించలేదు.

4. సునన్ అత్ తిర్మిది (మరణం: హిజ్రీ 279)

ఇది కూడా విశ్వాసాలు, ఆరాధనలు, లావాదేవీలు, యుద్ధాలు, ఖుర్ఆన్ వ్యాఖ్యానం మరియు విశిష్టతలకు సంబంధించి దైవప్రవక్త ముహమ్మద్(స) వారి నుండి రచయితకు అందిన సమస్త హదీసులను సేకరించిన సమగ్ర గ్రంథాలలో ఒకటి. అయితే, ఇందులో రచయిత కేవలం ప్రామాణికమైన వాటినే సేకరించాలనే నిబంధన పెట్టుకోలేదు; అందుకే ఇందులో సహీహ్ (అత్యంత ప్రామాణికమైనది), హసన్ (మంచి ప్రామాణికత కలిగినది) మరియు దఈఫ్ (బలహీనమైనది) హదీసులు కూడా ఉన్నాయి.

5. సునన్ అన్ నసాయి (మరణం: హిజ్రీ 303)

ఇది కూడా ఇస్లామీయ నియమావళి (ఫిఖ్) అధ్యాయాల క్రమంలోనే కూర్చబడింది. ఇందులో సహీహ్ (అత్యంత ప్రామాణికమైనవి), హసన్ (మంచి ప్రామాణికత కలిగినవి) మరియు దఈఫ్ (బలహీనమైనవి) హదీసులు ఉన్నాయి.

6. సునన్ ఇబ్న్ మాజా (మరణం హిజ్రీ 273)

ఇది ఇస్లామీయ నియమావళి (షరీఅత్) కి సంబంధించిన వివిధ అధ్యాయాలపై ఆధారపడి ఉంది. ఇందులో అత్యంత ప్రామాణికమైనవి (సహీహ్), ఆమోదయోగ్యమైనవి (హసన్) మరియు బలహీనమైనవి (దఈఫ్) ఉన్నాయి. అలాగే బలహీనమైన వాటిలో కొన్ని పూర్తిగా తిరస్కరించదగినవి కూడా ఉన్నాయి.

ఇమామ్ అల్-హాఫిజ్ అబూ అల్-హజ్జాజ్ అల్-మిజ్జీ (మరణం క్రీస్తు శకం 742) వారు సెలవిచ్చారు:

అల్లాహ్ సున్నత్ పరిరక్షణ కోసం విశేషమైన జ్ఞాపకశక్తి కలిగిన వారిని, లోతైన జ్ఞానం గల నిష్ణాతులను మరియు నిశితంగా పరిశీలించగల విమర్శకులను నియమించాడు. వీరు అతివాదుల మార్పుల నుండి, అసత్యవాదుల కల్పనల నుండి మరియు అజ్ఞానుల తప్పుడు వ్యాఖ్యానాల నుండి సున్నత్‌ను కాపాడుతూ వచ్చారు. సున్నత్‌ను భద్రపరచాలనే పట్టుదలతో మరియు అది కనుమరుగైపోతుందేమో అన్న ఆందోళనతో వారు దానిని రకరకాలుగా, విభిన్న పద్ధతులలో క్రోడీకరించారు. ఆ క్రోడీకరణలలో అత్యంత శ్రేష్ఠమైనది, నాణ్యమైన రచన, ఎక్కువ ఖచ్చితత్వం కలిగి ఉండి అతి తక్కువ పొరపాట్లు ఉన్నది, అందరికీ ఎంతో ప్రయోజనకరంగా, శుభప్రదంగా మరియు సులభంగా ఉండి, అనుకూలురు మరియు ప్రతికూలురు సైతం అంగీకరించినది "సహీహ్ అబీ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అల్ బుఖారీ". దీని తర్వాత "సహీహ్ అబీ అల్ హుసైన్ ముస్లిం బిన్ హజ్జాజ్ అన్ నైసాబూరీ" నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో అబూ దావూద్ సులైమాన్ బిన్ అష్ అత్ అస్ సిజిస్తానీ వారి "సునన్", అబూ ఈసా ముహమ్మద్ బిన్ ఈసా అత్ తిర్మిదీ వారి "జామి", అబూ అబ్దుర్రహ్మాన్ అహ్మద్ బిన్ షుఐబ్ అన్ నసాయి వారి "సునన్" మరియు చివరిగా అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ యజీద్ (ఇబ్న్ మాజా అల్ ఖజ్వీనీగా ప్రసిద్ధులు) వారి "సునన్" గ్రంథం ఉన్నాయి. ఇబ్న్ మాజా గ్రంథం మిగిలిన వాటి స్థాయిని అందుకోలేకపోయినప్పటికీ, ఇది కూడా ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది.

"ఈ 'ఆరు గ్రంథాలలో' (కుతుబే సిత్త) ప్రతి ఒక్కదానికీ ఒక ప్రత్యేకత ఉంది, దానిని ఈ రంగంలోని నిష్ణాతులు గుర్తించారు. అందుకే ఈ గ్రంథాలు ప్రజల మధ్య ఎంతో ప్రసిద్ధి చెందాయి మరియు ఇస్లామీయ దేశాలన్నింటిలోనూ విస్తరించాయి. వీటి వల్ల ఎంతో ప్రయోజనం చేకూరింది మరియు విద్యార్థులు వీటిని అభ్యసించడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు." - తహ్దీబ్ అల్-కమాల్ (1 / 147).

ప్రామాణికమైన (సహీహ్) మరియు బలహీనమైన (దఈఫ్) హదీసుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం.

ఒక ముస్లిము తాను తెలుసుకోవాలనుకుంటున్న హదీసు యొక్క స్థాయిని, అనగా అది ఆమోదయోగ్యమైన ప్రామాణిక (సహీహ్) హదీసా లేక తిరస్కరించదగిన బలహీన (దఈఫ్) హదీసా అనే విషయాన్ని హదీసు శాస్త్ర నిష్ణాతులు మరియు అందులో ప్రావీణ్యం గల విద్వాంసులను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. వారు హదీసు యొక్క నివేదనా క్రమం (సనద్) మరియు దానిలోని పాఠ్యం (మతన్) యొక్క స్థితిగతులను, అవి ఆమోదయోగ్యమైనవా లేదా తిరస్కరించదగినవా అనే కోణంలో లోతుగా అధ్యయనం చేశారు.

దీనికి సంబంధించి అనేక గ్రంథాలు మరియు రచనలు ఉన్నాయి. అలాగే, ప్రామాణికమైన (సహీహ్) హదీసుల నుండి బలహీనమైన (దఈఫ్) హదీసులను వేరు చేయడానికి మరియు వాటిని గుర్తించడానికి సహాయపడే అనేక విశ్వసనీయమైన యాప్‌లు (అప్లికేషన్లు) మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

హదీసుల స్థాయిని (ప్రామాణికతను) తెలుసుకోవడానికి సహాయపడే యాప్‌లు (అప్లికేషన్లు) మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు:

దురర్ అల్-సున్నియ్యా (సున్నతు యొక్క ఆణిముత్యాలు) వెబ్‌సైట్‌లోని హదీసు విజ్ఞాన సర్వస్వం (మౌసూఅతుల్ హదీసియ్యా) లో లక్షలాది హదీసులు క్రోడీకరించబడ్డాయి. ఇందులో ప్రాచీన, మధ్యకాలీన మరియు వర్తమాన కాలపు హదీసు నిష్ణాతులు ఆయా హదీసుల ప్రామాణికతపై వెల్లడించిన అభిప్రాయాలు కూడా పొందుపరచబడ్డాయి. దీనిని ఈ లింక్ ద్వారా సంప్రదించవచ్చు: https://dorar.net/hadith

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి